మహిళా రిజర్వేషన్ (Woman Reservation ) బిల్లుకు మద్దతిస్తామని కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ (Sonia Gandhi) వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ మద్ధతిస్తోందని చెప్పారు. ఈ బిల్లును తీసుకు రావడంతో రాజీవ్ గాంధీ (RAjiv Gandhi) స్వప్పం నెరవేరిందన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రాజీవ్ గాంధీ రిజర్వేషన్ కల్పించారని వెల్లడించారు. ఈ బిల్లును తక్షణమే అమలులోకి తీసుకు రావాలని డిమాండ్ చేశారు.
లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ చర్చను ప్రారంభించారు. ఈ సందర్బంగా బిల్లుపై సోనియా గాంధీ మాట్లాడారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో మహిళా ప్రాతినిధ్యం పెంచేందుకు రాజీవ్ గాంధీ రాజ్యాంగ సవరణ తీసుకు వచ్చారని చె్పారు. కానీ రాజ్యసభలో 7 ఓట్ల తేడాతో ఆ బిల్లు వీగిపోయిందని ఆమె తెలిపారు.
ఆ తర్వాత ప్రధాని పీవీ నరసింహరావు నాయకత్వంలో ఆ బిల్లును ఆమోదించామన్నారు. ఫలితంగా దేశ వ్యాప్తంగా స్థానిక సంస్థల్లో 15 లక్షల మంది మహిళా ప్రతినిధులు ఇప్పుడు వున్నారని చెప్పారు. రాజీవ్ గాంధీ కలలు అసంపూర్తిగా నెరవేరాయన్నారు. ఈ బిల్లు ఇప్పుడు ఆమోదం పొందితే రాజీవ్ గాంధీ స్వప్నం పూర్తిగా నెరవేరుతుందన్నారు.
భారతీయ మహిళలకు మహాసముద్రమంత ఓపిక ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరి అభివృద్ది కోసం ఒక నదిలాగా స్త్రీ కష్టపడుతుందన్నారు. ఈ బిల్లుకు కాంగ్రెస్ పూర్తిగా మద్దతు తెలుపుతోందన్నారు. కానీ తమకు ఇంకా కొన్ని ఆందోళనలు వున్నాయన్నారు. భారతీయ మహిళలు తమ రాజకీయ బాధ్యతల కోసం 13 ఏండ్లుగా ఎదురు చూస్తున్నారన్నారు. మళ్లీ ఇప్పుడు మరికొంత కాలం ఆగాలంటున్నారని ఆమె అన్నారు. ఇప్పుడు ఈ బిల్లు అమలు కోసం ఇంకెంత కాలం వేచి వుండాలని ప్రశ్నించారు. భారతీయ మహిళల పట్ల ఇలాంటి పద్దతి సరైనదేనా అని ఆమె నిలదీశారు.