కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ (Madhu Yaskhi Goud) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఫామ్ హౌస్ పై విచారణ జరిపి అవినీతిని వెలికి తీస్తామని అన్నారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేందుకు చాలా మంది నేతలు రెడీగా ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ తామే వారిని పార్టీలోకి తీసుకునేందుకు ఆలోచిస్తున్నామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ నేతలు గుంట నక్కల్లాగా వేచి చూస్తారని ఆరోపించారు. కానీ తమ ప్రభుత్వానికి ఇప్పడు ఎలాంటి ఢోకా లేదన్నారు. అనేక మంది విపక్ష నేతలు తమతో టచ్‌లో ఉన్నారని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల వరకు తెలంగాణ పీసీసీ చీఫ్ ను మార్చబోరని వెల్లడించారు.
ఈ పదేండ్లలో బీఆర్ఎస్ సర్కార్ తెలంగాణను పూర్తిగా నాశనం చేసిందని ఆరోపించారు. సంక్షేమ పథకాల పేరుతో అవినీతికి పాల్పడిన ఎవరినీ కాంగ్రెస్ ప్రభుత్వం విడిచిపెట్టబోదని హెచ్చరించారు. అన్ని శాఖలపై ఇప్పటికే సమీక్షలు చేస్తున్నామని, వాస్తవ పరిస్థితుల గురించి తెలుసుకున్నామని చెప్పారు. రాజ్యాంగ బద్దమైన సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంస్కార హీనంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
తెలంగాణ గొంతు అని చెప్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. పార్టీ గెలుపు కోసం పని చేస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పీసీసీ పదవి ఖాళీగా లేదన్నారు. ఒక వేళ అధిష్టానం తనకు ఆ బాధ్యతలు అప్పగిస్తే తాను నిర్వహిస్తానన్నారు.