ఈసారి కామారెడ్డి (Kamareddy) నుంచి కేసీఆర్ (KCR) పోటీకి దిగుతున్నారు. దీంతో ప్రత్యర్థుల్లో వణుకు మొదలైందని గులాబీ నేతలు తెగ చెబుతున్నారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ (Shabbir Ali) బరిలో ఉంటారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆయన ఇంకో నియోజకవర్గం చూసుకుంటున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. దీనిపై తాజాగా షబ్బీర్ అలీ మరోసారి స్పందించారు.
తాను వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి నుంచే పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు షబ్బీర్ అలీ. తన పుట్టుక మరణం కామారెడ్డితోనేనని తేల్చి చెప్పారు. తాను ఇక్కడ పోటీ చేయడం లేదని బీఆర్ఎస్ (BRS) నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కామారెడ్డిలో కేసీఆర్ అధర్మ యుద్ధానికి పాల్పడితే ప్రజలు క్షమించరని హెచ్చరికలు జారీ చేశారు.
కామారెడ్డి ప్రజలు కేసీఆర్ కు రాజకీయ సమాధి కడతారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్ లోనే ఉంటానని ఇటీవల కేసీఆర్ ఆ నియోజకవర్గ నాయకులకు చెప్పారని.. ఆ వ్యాఖ్యలపై కామారెడ్డి ప్రజలకు ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కేసీఆర్.. గజ్వేల్ నుంచి ఇక్కడికి వస్తున్నావని షబ్బీర్ అలీ అన్నారు.
కామారెడ్డి నుంచే పోటీ చేస్తానని.. కేసీఆర్ రా.. ఇద్దరం తల పడదామని సవాల్ విసిరారు షబ్బీర్ అలీ. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలను కోరారు. కేసీఆర్ ను ఓడిస్తానని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ఓటమి తప్పదని శపనార్ధాలు పెట్టారు.