మాదక ద్రవ్యాల కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేను సుఖ్ పాల్ సింగ్ ఖైరా (Sukhpal Singh Khaira)ను పోలీసులు అరెస్టు చేశారు. చండీగఢ్ లోని నివాసంలో ఆయన్ని పోలీసు (Police) లు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు సమయంలో పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఖైరా సెక్టార్-5 లోని ఆయన నివాసంలో జలాలా బాద్ పోలీసులు ఈ రోజు ఉదయం దాడులు చేశారు. గతంలో ఆయనపై నమోదైన మాదక ద్రవ్యాల కేసుకు సంబంధించి ఈ దాడులు చేశారు. పోలీసులు తనిఖీలు చేస్తుంగా సుఖ్ పాల్ సింగ్ కుటుంబ సభ్యులు వీడియో తీశారు. వారంట్ లేకుండా ఎలా తనిఖీలు చేస్తారంటూ పోలీసులతో సుఖ్ పాల్ సింగ్ వాగ్వాదానికి దిగడం వీడియోలో కనిపిస్తోంది.
అనంతరం ఆయన్ని జలాలాబాద్ డీఎస్పీ అచ్చు రామ్ శర్మ అరెస్టు చేశారు. గతంలో నమోదైన మాదక ద్రవ్యాల కేసుకు సంబంధించి ఆయన్ని అరెస్టు చేస్తున్నట్టు డీఎస్పీ వెల్లడించారు. గతంలోనే ఆ కేసును సుప్రీం కోర్టు కొట్టి వేసిందని సుఖ్ పాల్ సింగ్ పోలీసులతో వాదించారు. కేవలం రాజకీయ కుట్రలో భాగంగా తనని అరెస్టు చేస్తున్నట్టు ఆరోపించారు.
సుఖ్ పాల్ సింగ్ ఖైరా ప్రస్తుతం బలోత్ నియోజక వర్గంలో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ గా పని చేస్తున్నారు. ఆయన అరెస్టును కాంగ్రెస్, శిరోమణి అకాళీ దళ్ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఆప్ ప్రభుత్వం కుట్ర పూరిత రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించాయి.