– వందల ఎకరాలున్న వాళ్లకు పెట్టుబడి సాయం ఎందుకు?
– సాగు చేస్తున్న వారికే లబ్ధి
– ట్యాక్సులు కట్టే వారికి రైతు బంధు అవసరమా?
– చర్చనీయాంశంగా జీవన్ రెడ్డి వ్యాఖ్యలు
– రైతు భరోసా విధివిధానాల్లో కీలక మార్పులు ఉండనున్నాయా?
కేసీఆర్ (KCR) సర్కార్ ప్రతిష్టాత్మకంగా రైతు బంధు (Rythu Bandhu) పథకం తెచ్చింది. రైతులకు పెట్టుబడి సాయం కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. 2018-19 ఖరీఫ్ సీజన్ లో ఇది ప్రారంభమైంది. వ్యవసాయ భూమి ఉన్న రైతులకు ఎకరాకు రూ.10 వేలు అందించింది. రెండు విడతల్లో వాయిదా ప్రచారం ఇచ్చింది. అయితే.. ఈ పథకానికి ఎకరాల సంఖ్యపై పరిమితి లేదు. అంతేకాకుండా, భూ యజమానికే లబ్ధి జరుగుతుంది. ఈ నేపథ్యంలో అనేక విమర్శలు ఎదురయ్యాయి. అయినా, కేసీఆర్ అవేవీ పట్టించుకోలేదు.
ప్రస్తుతం తెలంగాణ (Telangana) లో అధికార మార్పిడి జరిగింది. కాంగ్రెస్ (Congress) సర్కార్ కొలువుదీరింది. తాము అధికారంలోకి వస్తే రైతు భరోసా (Rythu Bharosa) కింద 15వేలు ఇస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో రైతు భరోసా విధివిధానాల్లో బిజీగా ఉంది ప్రభుత్వం. ఈసారికి గతంలో ఇచ్చిన మాదిరిగానే 10వేల సాయం అందిస్తోంది. నెక్స్ట్ నుంచి 15వేలు ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అయితే.. కేసీఆర్ హయాంలో వినిపించిన మాటే ఇప్పుడు కూడా వినిపిస్తోంది. వందల ఎకరాలున్న వాళ్లు, ట్యాక్సులు కట్టే వాళ్లకు రైతు బంధు అవసరమా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కొద్ది రోజులుగా ఈ విషయాన్ని పదే పదే వినిపిస్తున్నారు. ఐటీ ట్యాక్స్ కట్టే వారికి.. వందల వేల ఎకరాలున్న వారికి రైతుబంధు ఇవ్వడం అసమంజసమని ఆయన అభిప్రాయపడుతున్నారు. కేవలం సాగు చేసే వారికే ప్రభుత్వం రైతుబంధు ఇవ్వాలనే డిమాండ్ ను వినిపిస్తున్నారు. అప్పుడే నిజమైన రైతులకు పెట్టుబడి సాయం అందుతుందని అంటున్నారాయన. రైతు భరోసాకు సంబంధించి విధివిధానాలపై పరిశీలన జరుగుతోందని.. నిజమైన రైతులకు పెట్టుబడి సహాయం చేయాలే కానీ.. ట్యాక్సులు కట్టే వాళ్లకు ఎందుకని ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ లో ఆయన పర్యటించారు.
జీవన్ రెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కొత్త ప్రభుత్వం అమలు చేయనున్న రైతు భరోసా విధివిధానాల్లో దీనిపై దృష్టి పెట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. అసలైన రైతుకు లబ్ధి జరిగినప్పుడే వారు ఆర్థికంగా బలపడతారని.. అప్పుడే రైతు భరోసా సాయానికి ఓ సార్థకత ఉంటుందని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్టు సమాచారం. ఆ దిశగానే అడుగులు వేయనున్నట్టు తెలుస్తోంది. అందుకే, జీవన్ రెడ్డి ఈ విషయాన్ని పదేపదే వినిపిస్తున్నారని అంతా అనుకుంటున్నారు.