మధ్యప్రదేశ్ (Madhya Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల మొదటి విడత జాబితాను కాంగ్రెస్ (Congress) విడుదల చేసింది. మొత్తం 144 మంది అభ్యర్థులతో మొదటి విడత జాబితాను విడుదల చేసింది. మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్, మాజీ ముఖ్య మంత్రి కమల్ నాథ్ రాష్ట్రంలోని చిద్వారా నియోజక వర్గం నుంచి బరిలో దిగనున్నారు.
ఇక మాజీ ముఖ్యమంత్రి, పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రాగిఘట్ నుంచి పోటీ చేయనున్నారు. ఇక దిగ్విజయ్ సింగ్ సోదరుడు లక్ష్మణ్ సింగ్ చచౌర నియోజక వర్గం నుంచి పోటీలో వుంటున్నారు. దిగ్విజయ్ సింగ్ కుమారుడు జయవర్దన్ సింగ్ రఘోఘర్ నుంచి పోటీ స్తున్నారు. ఇక రాష్ట్ర ముఖ్య మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు పోటీగా బుద్ని నియోజక వర్గం నుంచి విక్రమ్ మస్తాల్ ను కాంగ్రెస్ బరిలోకి దించింది.
చుర్హత్ నుంచి అజయ్ సింగ్ రాహుల్, రావ్ నుంచి జిత్తూ పట్వారీ, అటేర్ నుంచి హేమంత్ కటారే, జబువా నుంచి విక్రాంత్ బురియాలను అభర్థులుగా కాంగ్రెస్ ప్రకటించింది. మొదటి జాబితాలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన 30 మందికి, ఎస్సీ సామాజిక వర్గం నుంచి 22 మందికి కాంగ్రెస్ అవకాశం కల్పించింది. కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసేందుకు నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ నిన్న సమావేశం నిర్వహించింది.
ఆ మరుసటి రోజే అభ్యర్థుల జాబితాను ప్రకటించడం విశేషం. ఇక అభ్యర్థుల ప్రకటన విషయంలో అధికార బీజేపీ అందరి కన్నా ముందు ఉంది. రాష్ట్రంలో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు వున్నాయి. అందులో ఇప్పటికే 136 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్రంలో నవంబర్ 17న పోలింగ్ ను నిర్వహించనున్నారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టనున్నారు.