ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ (Congress) వర్కింగ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలపై చర్చించిన నేతలు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోందో క్లారిటీ ఇచ్చేశారు. అలాగే, కులగణన అంశంపైనా ప్రధానంగా చర్చించారు.
భేటీ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం సమర్థమైన వ్యూహం అవసరమని అన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కాంగ్రెస్ విజయాలు పార్టీ క్యాడర్ లో కొత్త ఉత్సాహం తెచ్చినట్లు చెప్పారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు సమన్వయం, క్రమశిక్షణ, ఐక్యతతో పని చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సామాజిక న్యాయం, హక్కులు కల్పించేందుకు దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలన్న డిమాండ్ ను మరోసారి లేవనెత్తారు.
ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో మల్లికార్జున్ ఖర్గేతో పాటు, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఖర్గే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యాక నూతన కమిటీ సెప్టెంబర్ 15, 16 తేదీల్లో హైదరాబాద్ లో తొలి సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరిగే లోక్ సభ ఎన్నికలకు వ్యూహరచనపై చర్చలు జరిపింది. గెలుపే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పని చేయాలనే సందేశాన్ని క్యాడర్ కు అందించింది. ఈసారి కూడా పార్టీ నేతలు, కార్యకర్తలకు అదే మెసేజ్ పంపింది. రానున్న ఎన్నికలకు సమాయత్తం కావాలని స్పష్టం చేసింది.