మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లో కాంగ్రెస్ (Congress) దూకుడు పెంచింది. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే రెండో విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 85 మందితో కాంగ్రెస్ రెండో విడత జాబితాను ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలోని ఒక స్థానంలో మినహా మొత్తం అసెంబ్లీ నియోజక వర్గాలకు కాంగ్రెస్ తన అభ్యర్థులను ప్రకటించింది.
అంతకు ముందు మొదటి విడతలో 144 స్థానాలకు కాంగ్రెస్ తన అభ్యర్థులను ప్రకటించింది. మొదటి విడతలో ప్రకటించిన అభ్యర్థుల పేర్లలో తాజాగా కొన్ని మార్పులు చేసింది. డాటియా నియోజక వర్గంలో మొదట అవదేశ్ నాయక్ ను కాంగ్రెస్ బరిలోకి దించింది. తాజాగా ఆయన స్థానంలో రాజేంద్ర భారతి పోటీ చేస్తారని కాంగ్రెస్ వెల్లడించింది.
డాటియాలో బీజేపీ నుంచి హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా పోటీ చేస్తున్నారు. ఇక పిచోరే స్థానంలో మొదట శైలేంద్ర సింగ్ ను అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది. తాజాగా ఆయన స్థానంలో అరవింద్ సిగ్ లోధి పోటీకి దించింది. ఇక ఎస్సీ రిజర్వ్డ్ గోటేగావ్ నియోజక వర్గంలో శేఖర్ చౌదరి స్థానంలో నర్మదా ప్రసాద్ ప్రజాపతిని కాంగ్రెస్ బరిలోకి దించింది.
దిమానీ అసెంబ్లీ స్థానంలో రవిందర్ సింగ్ తోమర్‌ను పోటీలోకి దించింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కు ఆయన వ్యతిరేకంగా పోటీ చేయనున్నారు. కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియాకు కంచుకోటగా భావించే గ్వాలియర్ నియోజక వర్గం నుంచి సునిల్ శర్మను అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది. నవంబర్ 17న రాష్ట్రంలో ఎన్నికలను నిర్వహించనున్నారు.