ఖలిస్తాన్ (Khalistan) ఉగ్రవాది గురు పత్వంత్ సింగ్ (Gurpatwant Singh Pannun)ను హత్య చేసేందుకు భారత ప్రభుత్వ ఉద్యోగి ఒకరు కుట్ర పన్నారంటూ అమెరికా చేసిన అభియోగాలపై భారత్ స్పందించింది. అమెరికా ఆరోపణలు ఆందోళన కలిగించే విషయమని తెలిపింది. అవి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకమని పేర్కొంది.
అంతర్జాతీయ స్థాయిలో వ్యవస్థీకృత నేరాలు, అక్రమ రవాణా, అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాదం అనేవి చట్టాన్ని అమలు చేసే సంస్థలకు ఆందోళన కలిగించే విషయమని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ అన్నారు. వాటిని చట్టబద్దమైన సంస్థలు కూడా పరిగణించాల్సి ఉంటుందని తెలిపారు. అందుకు దీనిపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
ఆ కమిటీ నివేదికల అనుగుణంగా తాము ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. అంతకు ముందు భారత్ పై అమెరికా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ను హత్య చేసేందుకు భారత ప్రభుత్వ ఉద్యోగి కుట్ర పన్నాడని తీవ్ర ఆరోపణలు చేసింది.
కుట్రలో భాగంగా ఈ ఏడాది మేలో అమెరికాలోని ఓ అధికారితో నిఖిల్ గుప్తా అనే భారత ప్రభుత్వ ఉద్యోగి లక్ష డాలర్లకు ఒప్పందం చేసుకున్నారని అభియోగాలు నమోదు చేసింది. ఆ ఆరోపణల ఆధారంగా భారత ప్రభుత్వ ఉద్యోగి నిఖిల్ గుప్తా (52)పై అమెరికా న్యాయ విభాగం కేసు నమోదు చేసింది. ఈ కేసులో నిందితుడు నిఖిల్ గుప్తాను చెక్ రిపబ్లిక్ అధికారులు 2023 జూన్ 30న అరెస్టు చేశారు.