హిందువులు దేవుడిగా ఆరాధించే శ్రీ రాముడి(Sri ramudu) పుట్టుక గురించి మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabakar) గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే, మరోసారి ఆయన చేసిన వ్యాఖ్యలు తెరమీదకు వచ్చాయి. దీంతో మంత్రి పొన్నం మరోసారి క్లారిటీ ఇచ్చారు.
రాముడిపై తాను గతంలో ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని స్పష్టంచేశారు. ఒకవేళ తాను అన్నట్లు బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనానికి కూడా సిద్ధం అంటూ మంత్రి సంచలన కామెంట్స్ చేశారు. తాను కూడా శ్రీరాముడిని ఆరాధిస్తామని..కానీ, రాముడి పేరు చెప్పుకుని రాజకీయాలు చేయమన్నారు.
ఇకపోతే తెలంగాణలో ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళతారని గులాబీబాస్, కేటీఆర్ ఇటీవల కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో పొన్నం కామెంట్స్ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
కాగా, బుధవారం శ్రీరామనవమి సందర్భంగా మంత్రి పొన్నం దంపతులు కరీంనగర్ జిల్లాలోని ఇల్లంతకుంట శ్రీ సీతారామ ఆలయంలో సతీసమేతంగా ప్రత్యేక పూజలు చేశారు.కోడ్ కారణంగా ఈసారి ప్రభుత్వం తరఫున పెద్దగా ఏర్పాట్లు చేయలేకపోయామని, కోడ్ ముగిశాక ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని తెలిపారు.