– ప్రధాని మోడీకి అరుదైన గౌరవం
– కాప్ 28 సదస్సులో ప్రారంభ ప్రసంగం
– అధ్యక్షుడితో కలిసి ప్లీనరీలో పాల్గొన్న ఏకైక లీడర్
– దుబాయ్ లో పలువురితో మర్యాదపూర్వక భేటీలు
ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) శుక్రవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరిగిన కాప్ 28 సదస్సు (COP28 Climate Summit) కు హాజరయ్యారు. ఈ సందర్భంగా అరుదైన గౌరవాన్ని పొందారు. కాప్ 28 సదస్సులో ప్రారంభ ప్రసంగం చేశారు. కాప్ సదస్సు అధ్యక్షుడు సుల్తాన్ అల్ జాబ్, యూఎన్ఎఫ్సీసీ కార్యనిర్వాహక కార్యదర్శి స్టెమన్ స్టెయిల్తో కలిసి ప్రారంభ ప్లీనరీలో పాల్గొన్న ఏకైక లీడర్ గా గుర్తింపు పొందారు.
ఈ సందర్భంగా హాజరైన వివిధ దేశాల ప్రతినిధులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగింస్తూ.. 2028లో జరగాల్సిన కాప్ 33 సదస్సును భారత్ లో నిర్వహిస్తామని ప్రతిపాదించారు. ప్రపంచ జనభాలో భారతదేశపు జనాభా 17 శాతం ఉన్నదని, కానీ ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే కర్బన ఉద్గారాల్లో భారత్ నుంచి విడుదలయ్యేది కేవలం 4 శాతమే అని వివరించారు.
నేషనల్లీ డిటర్మైండ్ కంట్రిబ్యూషన్ లక్ష్యాల సాధన దిశగా తాము వేగంగా కదులుతున్నామని తెలిపారు. ఇతర దేశాలు కూడా కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించుకోవాలని కోరారు. ఇక, సదస్సుకు హాజరైన పలు దేశాల అధినేతలను మర్యాదపూర్వకంగా పలకరించారు మోడీ. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తో సంభాషించారు. భారత్, బ్రిటన్ స్నేహం రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును రూపొందించడంలో సహాయపడుతుందని మోడీ ట్వీట్ చేశారు.
ఇటు, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఖలీఫాతో మాట్లాడారు. బహ్రెయిన్ తో బలమైన, శాశ్వతమైన సంబంధాలను భారత్ ఎంతో విలువైనదిగా పరిగణిస్తుందని పేర్కొన్నారు. ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్ అధ్యక్షులతోనూ ప్రధాని ముచ్చటించారు. ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఐజాక్ హెర్జోగ్ తోనూ మోడీ సమావేశమయ్యారు.