ఛత్తీస్ గఢ్ లోని భూపేశ్ బాఘేల్ ( Bhupesh Baghel) సర్కార్ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అవినీతిలో కూరుకు పోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలో కొనసాగే హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాత్రమూ లేదని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
రాయ్‌పూర్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని అమ్లిదిహ్ ప్రాంతంలో నిర్వహించిన ‘బూత్ విజయ సంకల్ప్ అభియాన్’ కార్యక్రమంలో జేపీ నడ్డా పాల్గొన్నారు. నియోజక వర్గంలో ప్రధాని మోడీ ‘మన్ కీ బాత్’ రేడియో ప్రసంగాన్ని జేపీ నడ్డా విన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…. భూపేశ్ బాఘేల్ అవినీతి, అసమర్థ, ప్రభుత్వాన్ని మనమంతా చూస్తూనే ఉన్నామని చెప్పారు. ఇన్నాళ్ల పాటు సీఎం కార్యదర్శి ఒకరు జైల్లో ఉండటం మీరు ఎప్పుడైనా చూశారా అని ఆయన ప్రశ్నించారు.
అవినీతి అనేది ఆ పార్టీ నుదిటిపై స్పష్టంగా కనిపిస్తు ఉంటే ఇంకా ఆధారాలు ఎవరు అడుగుతారని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అలాంటి అవినీతి ప్రభుత్వం ఇంకా అధికారంలో ఉండాలా అని ప్రజలను ఆయన ప్రశ్నించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యువతను మోసం చేసిందా లేదా అని ఓటర్లను ఆయన ప్రశ్నించారు. మహిళలకు ప్రతి నెలా రూ. 500 వస్తున్నాయా? అని అడిగారు. రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అని అన్నారు.
రాష్ట్రంలో మద్యపాన నిషేధం విదిస్తామని బాఘేల్ సర్కార్ హామీ ఇచ్చిందన్నారు. కానీ తర్వాత ప్రభుత్వం లిక్కర్ కుంభకోణానికి పాల్పడిందన్నారు. చివరికి ఆవులు, ఆవు పేడను కూడా విడిచి పెట్టకుండా అవినీతికి పాల్పడ్డారన్నారు.అలాంటి అవినీతి ప్రభుత్వానికి ఇంకా అధికారంలో కొనసాగే హక్కు లేదని ఆయన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.