ఛత్తీస్ గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఆ విషయం తెలుసన్నారు. పఠాన్ నియోజక వర్గంలో ఏకంగా సీఎం భూపేశ్ భాఘేల్ ఘోరంగా ఓడిపోనున్నారని వెల్లడించారు.
రాష్ట్రంలోని ముంగేలి జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ….ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్, డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్ డియో మధ్య అధికారాన్ని పంచుకునే విషయంలో ఒప్పందం జరిగినట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పై విరుచుకు పడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటమి ఖాయమని, సీఎం భూపేశ్ బాఘేల్ కూడా పఠాన్ నియోజక వర్గం నుంచి ఓడిపోతారని కొంత మంది జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు మోడీ అంటే ద్వేషమని ప్రధాని మోడీ అన్నారు. ఇప్పుడు మోడీ అనే కులాన్ని కూడా కాంగ్రెస్ ద్వేషించడం మొదలు పెట్టిందన్నారు.
మోడీ పేరు మీద ఇప్పుడు మొత్తం ఓబీసీ కులాన్ని కూడా కాంగ్రెస్ ద్వేషిస్తోందన్నారు. అలాంటి చర్యలు సరికాదని న్యాయస్థానాలు చెప్పిన తర్వాత కూడా ప్రజలకు కాంగ్రెస్ క్షమాపణలు చెప్పడం లేదన్నారు. ఓబీసీ కమ్యూనిటీని కాంగ్రెస్ ఎంత ద్వేషిస్తుందో చెపేందుకు ఇది ఒక ఉదాహరణ అని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ ఏమైనా చేయగలదన్నారు.