పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుంటంతో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు.కాంగ్రెస్ ఈ దేశాన్ని నాశనం చేసిందని అటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్న తరుణంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లేకపోతే ఈ దేశం ముందకు వెళ్లేది కాదని, భారత్ ఇప్పుడు ఈ స్టేజీలో ఉందంటే అందుకు కాంగ్రెస్ కారణమని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.
బుధవారం నాంపల్లిలోని గాంధీభవన్లో జగ్గారెడ్డి(EX Mla Jaggareddy) మీడియాతో ముచ్చటించారు.ఈ సందర్బంగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కాంగ్రెస్ పై చేస్తున్న విమర్శలకు ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ఏం చేసింది ఏం చేసింది అని ప్రతిపక్షాలు పదే పదే ప్రశ్నిస్తున్నాయి. అసలు ఐటీని ఈ దేశానికి పరిచయం చేసింది రాజీవ్ గాంధీ. కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులకు మూలం రాజీవ్ గాంధీ. ఈ రోజు ప్రపంచ దేశాల్లో మన దేశం అగ్రగామి అయ్యిందంటే అందుకు కారణం కాంగ్రెస్ పార్టీ.
ఈ రోజుల్లో సెల్ ఫోన్ వాడే ప్రతి వారి చేతుల్లో రాజీవ్ గాంధీ ఉంటారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ సెల్ ఫోన్ వాడుతున్నారంటే అది కూడా రాజీవ్ గాంధీ వల్లే. అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీని తిట్టే ముందు వారు వాడుతున్న టెక్నాలజీని గుర్తు పెట్టుకోవాలి. 18 ఏళ్లకే నేటితరం యువత ఓటు హక్కును వినియోగించుకుంటున్నారంటే అది కూడా రాజీవ్ గాంధీ కృషి వల్లే సాధ్యమైంది. శాంతి స్థాపన కోసం శ్రీలంకకు సైనికులను పంపించింది భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ.
శాంతి స్థాపన కోసం ఏకంగా రాజీవ్ గాంధీ తన ప్రాణాలను అర్పించారు. దేశ భక్తి, త్యాగంలో రాజీవ్ గాంధీకి మించినవారు బీజేపీ, బీఆర్ఎస్లో ఉన్నారా? దేశం కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ.. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో ఘనతను సాధించింది. దేశాన్ని ముందుకు నడిపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అటువంటి పార్టీని ప్రతిపక్షాలు విమర్శించడం సిగ్గచేటని జగ్గారెడ్డి తెలిపారు.