భారత్‌లో కరోనా(Covid-19) మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా చాపకింద నీరులా వ్యాప్తి చెందుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా జయశంకర్ భూపాలపల్లి(Jayashankar Bhupalapally)జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. ఒకే కుటుంబంలో ఐదుగురికి పాజిటివ్ నిర్ధారణ అయింది.
అందులో ఒకరు వరంగల్ ఎంజీఎంలోని ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన సుంకరి యాదమ్మ (65)కు మూడు రోజుల క్రితం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో.. వరంగల్ ఎంజీఎంలో అడ్మిట్ చేశారు.
కుటుంబంలోని మిగతా నలుగురు వారి నివాసంలోనే ఐసోలేషన్‌లో ఉన్నారు. యాదమ్మ కుటుంబసభ్యులు భాస్కర్ (42), వీణ (30), ఆకాష్ (13), మిద్దిని (5)లు ఇంట్లోనే ఉండి.. వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం వీరందరూ బాగానే ఉన్నారు.
తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు దాదాపుగా 50 ఉన్నాయి. మరోవైపు, దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య పెరిగిపోతోంది. భారత్‌లో గడిచిన 24గంటల్లో కొత్తగా 656మంది వైరస్ బారిన పడ్డారు. ఒకరు మృతిచెందారు. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 4,054కు చేరింది.