రెండు నెలల్లో హైదరాబాద్ (Hyderabad) నగరంలో మాదక ద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించాలని పోలీసులను సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి (CP Srinivas Reddy) ఆదేశించారు. ఒక నేరస్తుడికి శిక్ష పడితే నేరం చేయాలనుకునే 100 మందిలో వణుకు పుడుతుందని సీపీ తెలిపారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో సిటీ పోలీసుల బృందంతో సీపీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో సీపీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ…. హైదరాబాద్ నగరంలో మాదక ద్రవ్యాల మాట అసలే వినపడవద్దని అన్నారు. రెండు నెలల్లో నగరంలో మాదక ద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీసు స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసే వారి పట్ల గౌరవంగా వ్యవహరించాలని పోలీసులకు ఆయన సూచించారు.
ఫిర్యాదులపై పారదర్శకంగా దర్యాప్తు జరపాలన్నారు. నిజమైన బాధితులకు మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ వర్తిస్తుందన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. అలాంటి అధికారులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలన్నారు. దీని కోసం అవసరమైన ప్రణాళికలు రెడీ చేయాలన్నారు.
పోలీస్ కమిషనర్ పేరు చెప్పి పైరవీలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలోకి మాదక ద్రవ్యాలు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఇక దేశంలో సైబర్ నేరాల దర్యాప్తులో హైదరాబాద్ తొలి స్థానంలో ఉందని వెల్లడించారు. మన దగ్గర అందుబాటులో ఉన్న వ్యవస్థను వినియోగించుకుని కేసుల దర్యాప్తును మరింత వేగవంతం చేయాలన్నారు.