టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి(chandra babu)ని అరెస్టు చేసిన తీరుపై సీపీఐ(cpi) నేత నారాయణ(Narayan) మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రిని ఇలా అర్ధరాత్రి ఇలా అరెస్టు చేయడం సరికాదని ఆయన ఫైర్ అయ్యారు. ఒక వ్యక్తిని ఎలా అరెస్టు చేయాలో సీఐడీకి చెప్పాలా? అంటూ ఆయన ప్రశ్నించారు. ఓ సాధారణ పౌరుడిని అరెస్టు చేసే సమయంలో పాటించే విధానాన్ని కూడా చంద్రబాబు విషయంలో సీఐడీ పాటించలేదన్నారు.
ఖమ్మంలోని గిరిప్రసాద్ భవన్లో జన సేవాదళ్ శిక్షణ శిబిరాన్ని సీపీఐ నారాయణ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. 14 ఏండ్లు సీఎంగా పని చేసిన వ్యక్తిని ఇలా అర్ధరాత్రి అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ఫైర్ అయ్యారు. చంద్రబాబు అరెస్టు విషయంలో జగన్ సర్కార్ వైఖరి సరికాదన్నారు. అమిత్ షా అనుమతి లేకుండా ఈ అరెస్టు జరగదని ఆయన అన్నారు. ఇప్పటికైనా బీజేపీ కుటిల నీతిని చంద్రబాబు తెలుసుకోవాలన్నారు.
మరో వైపు చంద్రబాబు అరెస్టును ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు పట్ల పోలీసులు అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో 8వ నిందితుడిగా ఉన్న వైఎస్ అవినాశ్‌రెడ్డిని అరెస్టు చేయకుండా పోలీసులతో సీఎం జగన్ అడ్డుకున్నారని అన్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో 37వ నిందితుడిగా ఉన్న చంద్రబాబును ఆగమేఘాల మీద అరెస్టు చేయడం వెనక ఉన్న దాగి వున్న ఆంతర్యం ఏంటని ఆయన నిలదీశారు. తనకు నచ్చిన వారికి ఒకలా… నచ్చని వారితో మరోలా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. గవర్నర్ దృష్టికి తీసుకు రాకుండా చంద్రబాబును అరెస్టు చేశారని తెలిపారు.
దీన్ని బట్టి చూస్తే పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. జగన్ సర్కార్ మోసాలను ఎండగట్టిన వారిని శత్రువులుగా చూస్తున్నారన్నారు. . ఏపీ ప్రభుత్వంలో నియంతృత్వ ధోరణి కనిపిస్తోందన్నారు. ప్రజాస్వామ్యం బతకాలంటే పౌరులు, ప్రతిపక్షాలను పాలకులు గౌరవించాలన్నారు. చంద్రబాబును అరెస్టు చేసిన విధానాన్ని ఎమ్మార్పీఎస్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. అజేయ కల్లం, ప్రేమేందర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవట్లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ విషయంలో టీడీపీ ఆందోళన చేపడితే ఎమ్మార్పీఎస్ మద్దతు తెలుపుతుందన్నారు.