కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశాన్ని ఈ నెల 21న నిర్వహించనున్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ ఓటమిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. దీంతో పాటు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ (BJP)ని మట్టికరిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ (AICC) ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు.
ఈ సమావేశాన్ని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో నిర్వహించనున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు నిరుద్యోగం, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణాలు ప్రధాన అంశాలుగా రాహుల్ గాంధీ యాత్ర చేపట్టనున్నారు. ఆ యాత్ర గురించి కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ యాత్రపై త్వరలోనే కాంగ్రెస్ తుది నిర్ణయం తీసుకోనుంది.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఇటీవల ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఈ నేపథ్యంలో ఓటమికి గల కారణాలపై ఈ సమావేశంలో సమీక్ష చేపట్టనున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ చేసిన తప్పులను పునరావృతం కాకుండా భవిష్యత్ ఎన్నికలకు ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై ఇందులో చర్చించేనున్నారు. మరోవైపు ఈ నెల 19న విపక్ష ఇండియా కూటమి సమావేశాన్ని నిర్వహించనున్నారు.
ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటు గురించి చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల ఎన్నికల్లో ఎదురైన అనుభవాల దృష్ట్యా విపక్షాలు ఎలాంటి ప్రణాళికలు అవలంభించాలనే దానిపై విస్తృతంగా చర్చించనున్నారు. సమావేశానికి రెండు రోజుల తర్వాత సీడబ్ల్యూసీ భేటీ నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. విపక్ష ఇండియా భేటీలో తీసుకున్న నిర్ణయాల గురించి ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది.
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు “మే నహీ, హమ్” (నేను కాదు మేము) అనే నినాదంతో ముందుకు వెళ్లాలని విపక్ష పార్టీలు భావిస్తున్నాయి. ఇది ఇలా వుంటే ఇటీవల ఛత్తీస్గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని ఊహించలేదని కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం అన్నారు. పార్టీకి ఇది ఆందోళన కలిగించే విషయమని తెలిపారు. ప్రతి ఎన్నికనూ తుది సమరంలా భావిస్తూ బీజేపీ పోరాడుతోంన్నారు. ఈ విషయాన్ని విపక్షాలు గ్రహించాలన్నారు.