Hyderabad Crime: గోవాలో రూ.10 వేలు… హైదరాబాద్ లో రూ.20 వేలు!
ఒక మహిళ ఇద్దరు వ్యక్తులు నుంచి సైబరాబాద్ (Cybarabad) పోలీసులు భారీగా మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మత్తుపదార్థాలను నైజీరియన్ల (Nigerian) నుంచి కొనుగోలు చేసినట్లు పోలీసుల (Police) విచారణలో తేలింది.
దాదాపు 52 గ్రాముల కోకైన్, 45 ఎల్‌ఎస్‌డీ పిల్స్, 8 గ్రాముల హెరాయిన్‌ను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. మోకిల వద్ద ఈ మత్తు పదార్థాలను విక్రయిస్తుండగా ఎస్‌ఓటీ బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింది కేసు నమోదు చేసినట్లు రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి మీడియాతో చెప్పారు. పట్టుబడిన మాదకద్రవ్యాల విలువ రూ.14 లక్షల వరకు ఉంటుందని డీసీపీ పేర్కొన్నారు.
పక్క సమాచారంతో మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా మాదకద్రవ్యాలను పట్టుకున్నామని, ఈ కేసులో అనురాధ అనే మహిళ కీలకంగా వ్యవహరించి నట్లు డీసీపీ తెలిపారు. ఈమె తరచుగా గోవాకు వెళ్తూ నైజీరియాకు చెందిన జేమ్స్‌తో పరిచయం ఏర్పరుచుకుని, మత్తుపదార్థాలను వివిధ మార్గాల్లో నగరానికి తీసుకొస్తున్నట్లు తెలిపారు. గోవాలో గ్రాము పదివేల రూపాయలకు కొనుగోలు చేసి, నగరంలో డిమాండ్ ను బట్టి రూ.20 వేల నుంచి అమ్ముతున్నారని తెలిపారు.
వీటి అమ్మకంలో ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి ఈమెకు సహకరించారని చెప్పారు. ప్రభాకర్ రెడ్డి మొదట వీటిని కొనుగోలు చేసేవాడనీ తర్వాత అతను కూడా అమ్మకాలు మొదలుపెట్టాడని చెప్పారు. ఈ తరహాలోనే గుంటూరుకు చెందిన శివ కూడా వ్యాపారం చేసాడని తెలిపారు.
ఈ ముగ్గురు నుంచి మూడు వాహనాలు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని మరిన్ని వివరాల కోసం విచారణ చేస్తున్నామన్నారు. వీరి సమాచారంతో మాదకద్రవ్యాల నెట్వర్క్‌పై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని చెప్పారు.