నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయు గుండం (Lowpressure) నెల్లూరు, మచిలీపట్నం వద్ద మంగళవారం తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ కేంద్రం (IMD)తెలిపింది. ఆ సమయంలో గంటలకు 100 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. తుఫాన్ ప్రభావం వల్ల అటు తమిళనాడులోనూ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.
తమిళనాడులోని నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ వెల్లడించింది. ఐఎండీ ప్రకారం… రాగల 24 గంటల్లో చెన్నై, తిరువల్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పాటు తమిళనాడులోని పలు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుసే అవకాశాలు ఉన్నాయి.
గత 24 గంటల్లో చెన్నైలోని నంగంబాకంలో 5.88సెంమీల వర్షం కురిసింది. అటు మీనంబాకంలో 7.12 సెంమీల వర్షపాతం నమోదైంది. చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం… శనివారం ఉదయం నుంచి తిరువళ్లూరులోని వివిధ ప్రాంతాల్లో, ముఖ్యంగా పలవెర్కాడు, పొన్నేరి, గుమ్మిడిపూండి, పెరియపాళయం, షోలవరం తదితర తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
మరోవైపు తుఫాన్ నేపథ్యంలో 144 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఏపీ మీదుగా వెళ్లే 144 రైళ్లను డిసెంబర్ 2 నుంచి 6 వరకు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. సికింద్రబాద్, విజయవాడ,విశాఖపట్టణం, తిరుపతి గుండా ప్రయాణించే రైళ్లు కూడా ఉన్నట్టు పేర్కొంది. అందువల్ల ప్రయాణికులు సహకరించాలని కోరింది.