అరేబియా (Arabia) సముద్రంలో ఏర్పడిన తేజ్ తుఫాన్ ఆదివారం మధ్యాహ్నం నాటికి తీవ్రమైన తుఫాన్ గా రూపాంతరం చెందే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD)హెచ్చరించింది. శనివారం రాత్రి 11.30 గంటలకు తేజ్ తుఫాన్ అరేబియా సముద్రంలో నైరుతి దిశలో సొకోత్రా(యెమెన్)కు 330కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు పేర్కొంది.
ఈ రోజు మధ్యాహ్నం వరకు తేజ్ అత్యంత తీవ్రమైన తుఫానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. రాబోయే 24 గంటల్లో ‘తేజ్’తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అరేబియా సముద్రం మీదుగా ఏర్పడిన తుఫాను అక్టోబర్ 25 తెల్లవారుజామున అల్ గైదా (యెమెన్), సలాలా (ఒమన్) మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది.
ప్రస్తుతం 62 నుంచి 88 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయని ఐఎండీ పేర్కొంది. ఈ ఈదురు గాలుల వేగం గంటకు 89 నుంచి 117 కిలోమీటర్లకు చేరుకుంటే దాన్ని తుఫానుగా పరిగణించనున్నట్టు తెలిపింది. దేశంలో గుజరాత తీరంపై తేజ్ ప్రభావం చూపే అవకాశం ఉందని ఐఎండీ చెబుతోంది.
కానీ పశ్చిమ వాయవ్య దిశగా తేజ్ కదులుతోందని, అందువల్ల గుజరాత్ తూర్పు ప్రాంతంపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని స్పష్టం చేసింది. ఈ ఏడాది జూన్‌లో అరేబియా సముద్రంలో బిఫర్ జాయ్ తుపాన్ ఏర్పడింది. ఈ తుపాన్ గుజరాత్ లోని కచ్ సౌరాష్ట్ర తీరాల్లోని పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించింది.