యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరమైన సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు మంత్రి ధర్మపురి శ్రీనివాస్(Ex Mp Darmapuri Srinivas) మరోసారి ఆస్పత్రిలో చేరారు. గత కొంతకాలంగా ఆయన తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల ఆస్పత్రిలో చేర్పించి ట్రీట్మెంట్ అనంతరం ఆయన ఆరోగ్యం కాస్త కుదుటపడింది.
అయితే, మరోసారి ఆయన ఆస్పత్రిలో చేరారు. దీంతో ఆయన అభిమానులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై నిజామాబాద్ ఎంపీ, ధర్మపురి శ్రీనివాస్ తనయుడు అర్వింద్ (Mp Arvind) సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్ (ఎక్స్)లో తన తండ్రితో కలిసి ఆస్పత్రిలో ఉన్న ఫోటోను ఆయన షేర్ చేశారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ధర్మపురి శ్రీనివాస్ మూత్రనాళాల్లో ఇన్ ఫెక్షన్ కారణంగా ఆస్పత్రిలో చేరినట్లు తెలిసింది. వైద్యులు ఆయన్ను పరిశీలించి ట్రీట్మెంట్ అందించినట్లు తెలిసింది. వయోభారంతో పాటు అనారోగ్య సమస్యల కారణంగా డి.శ్రీనివాస్ ఇబ్బంది పడుతున్నారని వైద్యులు వెల్లడించినట్లు ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. కాగా, డి.శ్రీనివాస్ త్వరలో కోలుకోవాలని ఆయన అభిమానులు వేడుకుంటున్నారు.
ఇదిలాఉండగా, ధర్మపురి శ్రీనివాస్ రాజకీయాలకు దూరమైన సమయంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు.చివరగా రాజ్యసభ సభ్యుడిగా ప్రజాసేవలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఇద్దరు కుమారులు రాజకీయాల్లో ఉన్నారు. ఇక అర్వింద్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం మరోసారి నిజామాబాద్ నుంచి బీజేపీ పార్టీ తరఫున ఎంపీగా పోటీగా చేస్తున్నారు.