ఇచ్చిన హామీలను అమలు చేస్తారని ప్రజలు వేయి కండ్లతో ఎదురు చూస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eeshwar) అన్నారు. తొమ్మిదిన్నర ఏండ్ల బీఆర్ఎస్ (BRS) పాలనలో ఎవరికీ ఇబ్బందులు కలిగించలేదని చెప్పారు. ప్రభుత్వం మారి నెల రోజులు కాగానే కాలువల్లో నీళ్లు లేవన్నారు. పింఛన్లు లేవని, తులం బంగారం లేదని, ఇప్పటి వరకు రైతు బందు పూర్తి స్థాయిలో ఇవ్వలేదని మండిపడ్డారు.
జగిత్యాల బీఆర్ఎస్ కార్యాలయంలో కొప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతూ….. కాంగ్రెస్ నాయకులు ఒకరికొకరు సంబంధం లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. పెన్షన్లు ఇస్తారా లేదా అనే విషయంపై క్లారిటీ ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలు చేస్తున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి ఎందు కోసం పర్యటనలు చేస్తున్నారో తెలియడం లేదన్నారు.
మేడిగడ్డ బ్యారేజీ, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు రోజుకో అసత్య ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. జీవన్ రెడ్డి ఊ అంటే కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడుతున్నాడని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై జీవన్ రెడ్డి వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అల్లాటప్పా ప్రాజెక్ట్ కాదు.. ప్రపంచ ఖ్యాతి గాంచిన ప్రాజెక్ట్ అని వ్యాఖ్యలు చేశారు.
ఖర్చు పెట్టింది రూ. 93 వేల కోట్లేనని…కానీ లక్ష కోట్లు అని తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాళేశ్వరం అంటే మేడిగడ్డనే కాదు వందల కొద్దీ పంప్ హౌస్, కెనాల్స్ అన్నారు. మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్ లో 20వ పిల్లర్ కుంగడంతో పక్కనే ఉన్న 19,21, పిల్లర్ల పై భారం పడిందని వివరించారు. ఈ మూడు పిల్లర్లను డైమండ్ కటింగ్‌తో తొలగించి తిరిగి నిర్మిస్తే సరిపోతుందని ఈఎన్‌సీ చెప్పిందన్నారు.
పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలసింది పోయి విచారణ పేరుతో మేడిగడ్డ పర్యటనలు చేస్తూ కాంగ్రెస్ అనవసర జాప్యం చేస్తోందని విమర్శలు గుప్పించారు. ఇప్పటి వరకు ప్రాజెక్టులపై విజిలెన్స్ కమిటీ ఎందుకు వేయలేదని నిలదీశారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు.
రైతులు ఇప్పుడు నారు వేసి నీటి కోసం దిక్కులు చూస్తున్నారని చెప్పారు. రైతు బంధు, రైతు సంక్షేమం పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ విభిన్న వ్యాఖ్యలు చేస్తుండడం విచారకరమన్నారు. లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోపే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.