ముంబై పేలుళ్ల సూత్రధారి, పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim) అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కరాచీ (Karachi)లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. ఆయనపై విషయ ప్రయోగం జరిగినట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ విషయాన్ని ఎవరూ అధికారికంగా ధ్రువీకరించలేదు.
కరాచీ ఆస్పత్రి వద్ద భారీగా భద్రతా దళాలను మోహరించారు. రెండు రోజుల క్రితం ఆయన ఆస్పత్రిలో చేరినట్టు తెలుస్తోంది. దావూద్ ఉన్న ఫ్లోర్ లోని పేషెంట్ల కుటుంబ సభ్యులు, వైద్యులు, దావూద్ కుటుంబ సభ్యులను మాత్రమే ఆస్పత్రిలోకి అనుమతిస్తున్నారు. ఇది ఇలా వుంటే దావూద్ ఇబ్రహీం ఆరోగ్యం గురించి, ప్రస్తుత పరిస్థితి గురించి తెలుసుకునేందుకు ముంబై పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
దావూద్ బంధువులు అలిషా పార్కర్, సాజిద్ వాఘ్లే ద్వారా దావూద్ గురించి మరింత సమాచారం సేకరిస్తున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో దావూద్ సోదరి హసీనా పార్కర్ కుమారుడు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణకు హాజరయ్యారు. దావూద్ రెండో వివాహం చేసుకున్నారని, ప్రస్తుతం కరాచీలో ఉన్నారని వెల్లడించారు. దావూద్ ఇబ్రహీమ్, అతని సహాయకులు కలిసి కరాచీ ఎయిర్ పోర్టను నియంత్రిస్తున్నారని ఎన్‌ఐఏ తన ఛార్జిషీట్‌లో పేర్కొంది.
1993లో ముంబై పేలుళ్ల కేసులో ఆయన ప్రమేయం ఉందని, ఆ ప్రణాళికను అమలు చేసింది దావూద్ ఇబ్రహీం అని భారత్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో గత కొన్నేండ్లుగా చట్టానికి దొరక్కుండా దావూద్ ఇబ్రహీం తప్పించుకు తిరుగుతున్నాడు. ప్రస్తుతం భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో దావూద్ ఒకడిగా ఉన్నాడు. దావూద్ కరాచీలోనే ఉన్నాడని భారత్ వాదిస్తోంది.
దావూద్ కరాచీలో ఉన్నాడనే వాదనలకు సంబంధించి భారత్ సాక్ష్యాధారాలను కూడా సమర్పించింది. కానీ పాక్ మాత్రం ఆ విషయాన్ని అంగీకరించడం లేదు. 2008లో ముంబైలో 26/11 ఉగ్రదాడుల సమయంలో పాక్ ఉగ్రవాదులకు ఆయుధాలు సమకూర్చింది దావూదే అని భారత్ ఆరోపిస్తోంది.
పాకిస్థాన్‌లో లష్కరే తోయిబా కమాండర్ అద్నాన్ అహ్మద్ అలియాస్ అబు హంజాలాతో పాటు పలువురు వాంటెడ్ టెర్రరిస్టులు పలు నగరాల్లో హతమవుతున్నారు. ఈ ఘటనల నేపథ్యంలో దావూద్ పై విష ప్రయోగం జరిగిందన వార్తలు సంచలనం రేపుతున్నాయి.