ఉత్తరాఖండ్‌లో సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. కార్మికకులను రక్షించేందుకు అధికారులు గత ఐదు రోజులుగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క కార్మికున్ని కూడా అధికారులు రక్షించలేకపోయారు. ఈ క్రమంలో సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ఆరోగ్యంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
సొరంగంలో చిక్కుకున్న వారికి పైపుల ద్వారా ఆహారం, నీటిని, ఆక్సిజన్ అందిస్తున్నారు. అంతకు ముందు సొరంగం మరోసారి కూలడంతో రెస్క్యూ ఆపరేషన్ మరింత ఆలస్యం అవుతోందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఇతర కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే టన్నెల్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో అధికారులు వారికి నచ్చ జెప్పి పంపించారు.
ఇది ఇలా వుంటే ఉత్తరఖండ్‌లో భూకంపం సంభవించింది. ఉత్తర కాశీలో గురువారం ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. భూమి లోపల 5 కిలో మీటర్ల లోతులో ప్రకంపనలు సంభవించినట్టు పేర్కొంది. రాజధాని డెహ్రడూన్ కు 140 కిలో మీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉన్నట్టు తెలిపింది.
తెల్లవారు జామున భూమి కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. వెంటనే రోడ్లపైకి పరుగులు తీశారు. గత 15 రోజుల్లో ఇది మూడవ సారి కావడం గమనార్హం. అంతకు ముందు ఈ నెల 3న ఉత్తరాఖండ్‌లో భూమి కంపించింది. భూకంప కేంద్రం నేపాల్ లో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. మరోవైపు నవంబర్ 5న 3.2 తీవ్రతో భూమి కంపించింది. యమునా నది లోయ ప్రాంతాల్లో ప్రకంపణలు ఎక్కువగా వచ్చాయి.