రాజ్యసభ (Rajya Sabha) లో మహిళా రిజర్వేషన్ బిల్లు (Woman Reservation Bill) ను కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ ప్రవేశ పెట్టారు. ఈ బిల్లు పేరుపై కాంగ్రెస్ ఎంపీ రంజిత్ రంజన్ విమర్శలు గుప్పించారు. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు అని అన్నారు. అంతే కానీ ఇది ఏ దేవుడో లేదా ప్రధాన మంత్రి ఇచ్చిన వరమో లేదా బహుమతో కాదని ఆయన మండిపడ్డారు.
దీనిపై జేపీ నడ్డా స్పందించారు. చాలా మంది వ్యక్తులు బిల్లు పేరుపై విమర్శలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి ఇందులోని పదాలు ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి మహిళల పట్ల ఉన్న గౌరవాన్ని, దృక్పథాన్ని వెల్లడిస్తున్నాయని చెప్పారు. భారతీయ సంస్కృతిలో మహిళలకు ఎల్లప్పుడూ ఉన్నత స్థానం ఉంటుందని ఆయన వెల్లడించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో బీజేపీ ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు ఆశించడం లేదని తెలిపారు. మహిళలకు సాధికరత కల్పించాలన్నదే బీజేపీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ బిల్లు విషయంలో ప్రధాని మోడీ కృషిని ఆయన అభింనందించారు. బిల్లు ఆమోదాన్ని మహిళా సాధికారత దిశగా భారీ ముందడుగు అని నడ్డా చెప్పారు.
ఈ బిల్లుపై చర్చ అనంతరం రాజ్యసభలో దీనిపై ఓటింగ్ నిర్వహించనున్నారు. ఇక ఇప్పటికే లోక్ సభలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. ఇప్పుడు రాజ్యసభలో కూడా ఆమోదం లభిస్తే బిల్లును రాష్ట్రపతి ఆమోద ముద్ర కోసం పంపించనున్నారు. రాష్ట్రపతి ఆమోద ముద్రతో బిల్లు చట్టంగా మారనుంది. నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేసిన తర్వాత ఈ బిల్లు అమలులోకి రానుంది.