ఢిల్లీ (Delhi)లో వాయు నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. వరుసగా నాలుగవ రోజు కూడా వాయు నాణ్యత (AQI) ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. ఢిల్లీలో ఈ రోజ వాయు నాణ్యత సూచీ 432గా ఉన్నట్టు కాలుష్య నియంత్రణ డేటా వెల్లడించింది. భవానా ప్రాంతంలో ఏక్యూఐ 478 ఉన్నట్టు పేర్కొంది.
దేశ రాజధానిలో కాలుష్యం ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తో పాటు పర్యావరణ, వాతావరణ, రవాణా శాఖ, ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు.
కాలుష్యం నేపథ్యంలో మరోసారి వాహనాల విషయంలో సరి-బేసి విధానాన్ని అమలు చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ నెల 13 నుంచి 20 వరకు సరి బేసి విధానాన్ని అమలు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తొలగించేందుకు మేఘ మధనం ద్వారా కృత్రిమ వర్షాలు కురిపించాలని, దాని వల్ల గాలిలోని కాలుష్య కారకాలు కొట్టుకుని పోతాయని ఐఐటీ కాన్పూర్ నిపుణుల బృందం వెల్లడించింది. ఈ విషయంపై ప్రభుత్వానికి ఇప్పటికే ఐఐటీ కాన్పూర్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీలోని ప్రాథమిక పాఠశాలలకు సెలవులు పొడిగిస్తున్నట్టు విద్యాశాఖ వెల్లడించింది. వాయు నాణ్యత సూచీ తగ్గిన నేపథ్యంలో ఈ నెల 10 వరకు పాఠశాలలను మూసి వేయాలని విద్యా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. 6 నుంచి 12 తరగతుల విద్యార్థులకు ఆన్ లైన్ లో క్లాసులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది.