దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో వాయు నాణ్యత (AQI) అకస్మాత్తుగా మరింత క్షీణించింది. దీంతో రాష్ట్రంలో రెండు రోజుల పాటు ప్రాథమిక పాఠశాలలను మూసి వేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
గౌతమ్ బుద్ నగర్, ఘజియాబాద్, ఫరీదాబాద్, గురుగ్రామ్ల ప్రాంతాల్లో అనవసరమైన నిర్మాణ కార్యకలాపాలను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిషేధించింది. ఇక ఇప్పటికే నగరంలోకి డీజిల్ ట్రక్కుల ప్రవేశాన్ని కూడా నిషేధించారు. రాజధాని, చుట్టుపక్కల ప్రాంతాలలో ఏటా పెరుగుతున్న కాలుష్యాన్ని పరిష్కరించేందుకు
గ్రేడెడ్ యాక్షన్ రెస్పాన్స్ ప్లాన్ స్టేజ్ IIIని రూపొందించారు.
స్టేజ్3లో భాగంగా అనేక ఇతర చర్యలను అమలు చేయనున్నారు. చెత్త, ఆకులు, ప్లాస్టిక్, రబ్బరు వంటి వ్యర్థాలను కాల్చడాన్ని నిషేధిస్తున్నట్టు గురుగావ్ జిల్లా కలెక్టర్ తెలిపారు. ఢిల్లీలో కాలుష్య స్థాయి ఈ సీజన్లో మొదటిసారిగా నిన్న అత్యంత తీవ్ర స్థాయికి చేరింది. నిన్న సాయంత్రం 5 గంటలకు వాయు నాణ్యత స్థాయి 402కు చేరింది.
రాబోయే రెండు వారాల్లో కాలుష్య స్థాయి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీలోని 37 మానిటరింగ్ స్టేషన్లలో కనీసం 18 ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) తీవ్రమైన స్థాయిలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఆయా నగరాల్లో వాయు నాణ్యత స్థాయి 400 అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నట్టు వెల్లడించారు.