దీపావళి రోజు దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో భారీ సంఖ్యలో అగ్ని ప్రమాదాలు (Fire Accidents) చోటు చేసుకున్నాయి. అగ్నిప్రమాదాలకు సంబంధించి సుమారు 200కు పైగా కాల్స్ వచ్చినట్టు అగ్ని మాపక శాఖ అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదాలకు సంబంధించి తమకు 208 కాల్స్ వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.
అందులో 22 కాల్స్ బాణా సంచా దుకాణాల్లో అగ్ని ప్రమాదాలకు సంబంధించినవని చెప్పారు. ఆదివారం తూర్పు కైలాష్ లోని సదర్ బజార్, తిలక్ నగర్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నట్టు తెలిపారు. ఈ ప్రమాదాల్లో ఎవరూ గాయపడలేదని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు.
సెంట్రల్ ఢిల్లీలోని సదర్ బజార్ డిప్యూటీ గంజ్ లోని ఓ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగిందన్నారు. మంటలను అదుపు చేసేందుకు ఇరవై రెండు అగ్నిమాపక యంత్రాలను ఉపయోగించామన్నారు. సుమారు రెండు గంటల సమయం శ్రమించి మంటలను అదుపులోకి తీసుకు వచ్చామన్నారు.
పశ్చిమ ఢిల్లీలోని తిలక్ నగర్ మార్కెట్‌లో అగ్నిప్రమాదం జరగడంతో అరడజను దుకాణాలు దగ్ధమయ్యాయని పేర్కొన్నారు. మరోవైపు ఔటర్ ఢిల్లీలోని సుల్తాన్‌పురిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందన్నారు. దీపావళి నేపథ్యంలో ఢిల్లీలో మరోసారి వాయు కాలుష్యం పెరిగిపోయిందని సఫర్ వెల్లడించింది.