దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో వాయు కాలుష్యం (Air Pollution) ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలో నిన్న వాయు నాణ్యత కాస్త మెరుగుపడినట్టు కనిపించినా ఈ రోజు మరోసారి తీవ్ర ప్రమాదకర స్థాయికి పడిపోయింది. ఇటీవల ముంబైలోనూ వాయు కాలుష్యం పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ 418గా నమోదైంది.
ఇక పంజాబీ బాగ్ ప్రాంతంలో ఏక్యూఐ 460 రికార్డు అయింది. నరేలాలో ఏక్యూఐ 448, బవానాలో 462, ఆనంద్ విహార్ 452 , రోహిణి 451గా ఉంది. నోయిడా, గురుగ్రామ్ ఇతర చుట్టు పక్కల నగరాల్లో కూడా పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ రోజు ఉదయం నోయిడా ఏక్యూఐ 409, గురుగ్రామ్ 370, ఫరీదాబాద్ (396), ఘజియాబాద్ (382)గా నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.
మరోవైపు నిన్న రాత్రి ఆనంద్ విహార్ ప్రాంతంలో ఏక్యూఐ అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఏక్యూఐ ఏకంగా 999 తాకడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీపావళికి ముందే ఇలాంటి పరిస్థితులు ఉంటే పండుగ తర్వాత పరిస్థితి ఎలా వుంటుందోనని అధికారులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
వాయు కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ అధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాలుష్యానికి సంబంధించి సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన సూచనలను అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులతో ఆయన చర్చించనున్నారు.