దేశంలో భారీ మాదకద్రవ్యాల ముఠా గుట్టురట్టయ్యింది. తమిళనాడుకు చెందిన ఓ సినీ నిర్మాత (Tamil film producer) కీలక సూత్రధారిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. కాగా ఆపరేషన్ ఢిల్లీ (Delhi) పోలీసులు, ఎన్‌సీబీ (NCB) అధికారులు సంయుక్తంగా నిర్వహించి అంతర్జాతీయ మత్తుపదార్థాల నెట్‌వర్క్‌ను చేధించారు.
ఈ దందా ఇండియాతో పాటు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియాలకు విస్తరించినట్లు తెలిపిన అధికారులు.. ఈ ఆపరేషన్‌లో భాగంగా ముగ్గురు వ్యక్తుల్ని ఢిల్లీలో అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. వారి నుంచి 50 కిలోల సూడోఎఫెడ్రిన్‌ను (Pseudoephedrine) స్వాధీనం చేసుకొన్నట్లు తెలిపారు. స్మగ్లర్లు తెలివిగా హెల్త్ మిక్స్ పౌడర్, ఎండు కొబ్బరి వంటి ఆహార పదార్థాల ముసుగులో వీటిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించామన్నారు.
వీటి పేరుతో గత 3 ఏళ్లలో వీరు మొత్తం 45 సరకులు పంపారని, అందులో సుమారు 3,500 కిలోల సూడోఎఫెడ్రిన్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా దీని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.2000 కోట్లకు పైగా ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు మత్తుపదార్థాల నెట్‌వర్క్‌ను చేధించడానికి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అధికారులను సంప్రదించినట్లు అధికారులు వెల్లడించారు
ఆయా దేశాల్లో ఉన్న నిందితులను కూడా త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా సూడోపెడ్రిన్ ను, మెథాంఫేటమిన్ తయారు చేయడానికి ఉపయోగిస్తారని తెలుస్తోంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా అత్యంత డిమాండ్ ఉన్న ఔషధం ఇదని అంటున్నారు.. ఇక దీనిని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో కిలో రూ.1.5 కోట్లకు విక్రయిస్తారని సమాచారం..