మానవత్వం అనేది అక్షరాలలో తప్ప ఆచరణలో కనబడటం లేదని కొన్ని సంఘటనలు చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం సమాజంలో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు.. బ్రతికే అవకాశాలు ఉన్నతనికి సాయం చేయకుండా వీడియోలు, ఫోటోలు తీస్తూ ఆయువుని కరిగిస్తున్నారు. ఇలాంటి ఘటనే దేశ రాజధాని నగరం ఢిల్లీ (Delhi)లో చోటు చేసుకుంది.
సౌత్ ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలో నివాసం ఉంటున్న పియూష్ పాల్ (Piyush Paul)అనే 30 సంవత్సరాల వ్యక్తి గురుగ్రామ్ లో ఫ్రీలాన్స్ ఫిల్మ్ మేకర్ (Freelance filmmaker)గా పని చేస్తున్నాడు. ఇతను బైక్ పై ఇంటికి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఫిల్మ్ మేకర్ ప్రాణాలు కోల్పోయాడు. ఇతను వెళ్ళే దారిలోనే వేగంగా వస్తున్న మరో బైకు పంచ్ శీల్ ఎన్ క్లేవ్ దగ్గర్లో పియూష్‌ని ఢీకొట్టింది.
కాగా ప్రమాదం జరిగిన విషయాన్ని గమనించిన కనికరం లేని స్థానికులు అక్కడికి చేరుకుని రక్తపు మడుగులో పడి ఉన్న పియూష్ వీడియోలు తీసుకున్నారే తప్ప సాయం చేసేందుకు ముందుకు రాలేదు. మరోవైపు ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని చావు బతుకుల్లో ఉన్న ఫిల్మ్ మేకర్ పియూష్ ని ఆసుపత్రికి తరలించారు.
హాస్పిటల్లో చికిత్స పొందుతూ పియూష్ మరణించినట్టు వైద్యులు తెలిపారు.. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ప్రమాదానికి కారణమైన నిందితుడి పేరు బంటీ అని తెలిపారు.