ఢిల్లీ (Delhi)లో వాయు నాణ్యత సూచీ (AQI) మరింత దారుణంగా పడిపోయింది. తాజాగా ఏక్యూఐ సూచీ 256గా నమోదైనట్టు సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (SAFAR-India)వెల్లడించింది. ఢిల్లీలో వాయు నాణ్యత పేలవమైన స్థాయిలో ఉందని పేర్కొంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఆనంద్ విహార్ ప్రాంతంలో యాంటీ స్మోగ్ గన్ ద్వారా నీటిని స్ప్రే చేశారు.
ఇక గురుగావ్లో వాయు నాణ్యత సూచీ 176 మితమైన స్థాయిలో ఉన్నట్టు పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం వాయు నాణ్యత అంత్యంత పేలవమైన స్థాయికి చేరుకుంది. ఈ ఏడాది మే తర్వాత వాయు నాణ్యత ఈ స్థాయికి పడి పోవడం ఇదే తొలిసారి అని అధికారులు వెల్లడించారు. ఉష్షోగ్రతలు పడి పోవడంతో వాయు నాణ్యత సూచీ పడిపోయిందని తెలిపారు.
వాయు నాణ్యత పడిపోయిన నేపథ్యంలో ఢిల్లీలో ‘రెడ్ లైట్ ఆన్- వెహికల్ ఆఫ్’ క్యాంపెయిన్ ను ప్రభుత్వం నేటి నుంచి ప్రారంభించనుంది. దీని ప్రకారం వాయు కాలుష్యానికి తగ్గించేందుకు గాను ఢిల్లీలో ట్రాఫిక్ లో రెడ్ లైట్ పడిన సమయంలో వాహనదారులు తమ వాహనాన్ని ఆపి వేయాల్సి వుంటుంది. దీంతో కాలుష్యాన్ని కొంత వరకు తగ్గించే అవకాశం ఉంటుంది.
దసరా నేపథ్యంలో వాయు నాణ్యత దారుణంగా పడి పోయింది. గత రెండేండ్లలో దసరా సీజన్లో ఈ స్థాయిలో వాయు నాణ్యత తగ్గి పోవడం ఇదే మొదటి సారి అని అధికారులు చెబుతున్నారు. ఇక దీపావళి నేపథ్యంలో వాయు కాలుష్యం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఫైర్ క్రాకర్స్ తయారీ, విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్టు ఆప్ సర్కార్ ప్రకటించింది.