దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత (AQI) మరోసారి క్షీణించింది (deteriorate). ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వాయు నాణ్యత తీవ్ర స్థాయికి పడిపోయింది. ఢిల్లీలో వాయు నాణ్యత అత్యంత పేలవమైన (Very Poor) స్థాయికి చేరినట్టు అధికారుల తెలిపారు. పలు ప్రాంతాల్లో వాయు నాణ్యత మరోసారి 400 దాటిందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తెలిపింది.
అశోక్ విహార్‌లో ఏక్యూఐ 405కు చేరుకుందని పేర్కొంది. భవానాలో ఏక్యూఐ 447కు నమోదైనట్టు వెల్లడించింది. ఇక ద్వారకాలో ఏక్యూఐ 405, జహంగిరి పురిలో 429గా ఉన్నట్టు తెలిపింది. మరోవైపు ఆనంద్ విహార్‌లో 378, బురారీ క్రాసింగ్‌లో 374, లోధి రోడ్‌లో 392 గా ఏక్యూఐ నమోదైనట్టు పేర్కొంది. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 10.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
అదే సమయంలో సాపేక్ష ఆర్ద్రత ఉదయం 8:30 గంటలకు 76 శాతంగా నమోదైనట్టు అధికారులు తెలిపారు. నగరంలో గడిచిన 24 గంటల్లో సగటు ఏక్యూఐ దారుణంగా పడిపోయింది. నగరంలో సోమవారం ఉదయం 348గా నమోదు అయింది. మంగళవారం అది 372కు చేరుకుంది. అంతకు ముందు ఆదివారం సరాసరి ఏక్యూఐ 301, శనివారం 319, శుక్రవారం 405, గురువారం 419గా నమోదైనట్టు అధికారులు చెప్పారు.
ఇది ఇలా వుంటే ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. నగరంలో వాయు నాణ్యతను మెరుగు పరిచేందుకు కావాల్సిన అన్ని చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఏక్యూఐకి సంబంధించి నివేదికను అందించాలని ఆదేశాలు జారీ చేసింది.