శ్రీశైలం క్షేత్రంలో భక్తులు భారీగా బారులు తీరారు. తెల్లవారుజాము నుండి స్వామి, అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ఇక శీఘ్ర, అతిశీఘ్ర దర్శనానికి 3-4 గంటలు, ఉచిత దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.
వరుస సెలవుల నేపథ్యంలో రెండు రోజులుగా ఆలయ పరిసరాలు రద్దీగా కనిపిస్తున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహిస్తున్నారు. స్వామివారి స్పర్శ దర్శనం టిక్కెట్లు దొరక్క భక్తులు ఇబ్బంది పడుతున్నారు.
అన్ని ఆర్జిత, స్పర్శ దర్శనం టిక్కెట్లు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి.. ఆఫ్ లైన్ లో లేవు అని కౌంటర్ సిబ్బంది స్పష్టం చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా క్యూలైన్లలో ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు ఆలయ ఈవో పెద్దిరాజు.
క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, మంచినీరు అందిస్తున్నట్టు తెలిపారు. వరుసగా సెలవలు కావడంతో క్షేత్రానికి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయ అధికారులు భావిస్తున్నారు.