తిరుమల(Tirumala) శ్రీవారి బ్రహోత్సవాల(Brahmotsavalu)ను ఈ నెల 18 నుంచి 26 వరకు నిర్వహించనున్నారు. దీంతో బ్రహ్మోత్స వాల కోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు(security arrangements) చేస్తున్నారు. తాజాగా బ్రహ్మోత్స వాల సందర్భంగా చేస్తున్న భద్రతా ఏర్పాట్లపై డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి సమీక్షించారు.
అన్నమయ్య భవన్ లో పోలీసు ఉన్నతాధికారులతో ఆయన ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో డీఐజీలు రవి ప్రకాశ్, రాజశేఖర్ బాబు ఎస్పీలు తిరుమలేశ్వర రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, సీవీయస్ఓ నరసింహ కిషోర్ పాల్గొన్నారు. ఈ నెల 18న సీఎం జగన్ తిరుమలకు రానున్నారు.
సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే విషయంలో అధికారులతో డీజీపీ చర్చించారు. మొత్తం 6 మంది ఎస్పీలు, 4900 మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. బ్రహ్మోత్స వాల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందన్నారు. రద్దీ పెరిగితే వెంటనే తిరుపతిలోనే ట్రాఫిక్ నియంత్రణ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
తిరుమలలో మొత్తం 15 వేల వాహనాలుకు పార్కింగ్ కు సౌకర్యాన్ని కల్పించామని ఎస్పీలు రాజేందర్ రెడ్డి, రవి ప్రకాశ్ లు వెల్లడించారు. భక్తుల కోసం తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. భద్రత కోసం డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నామన్నారు. మాడ వీధుల్లో ప్రత్యేకమంగా భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు.