పార్లమెంట్ (Parliament)లో 78 మంది ఎంపీల (MP)ను సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ మాజీ నేత, ఎంపీ కపిల్ సిబల్ (Kapil Sibal) స్పందించారు. భారత పార్లమెంట్ చరిత్రలోనే ఇది అతి పెద్ద చర్య అని ఆయన అభివర్ణించారు. ప్రజాస్వామ్య మాత దాన్ని అనాథగా చేసిందన్నారు. ప్రజాస్వామ్యం మనుగడ’ను కాపాడే బాధ్యతను పౌరులు తీసుకోవాలని కపిల్ సిబల్ కోరారు.
మరోవైపు ఎంపీల సస్పెన్షన్ పై బీజేపీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాల తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడిగా ఆయన అభివర్ణించారు. దేశంలో గంగా జమునా తహజీబ్ సంస్కృతిపై దాడి అని పేర్కొన్నారు. దీన్ని దుష్ప్రవర్తన, సభాధ్యక్ష స్థానం ఆదేశాలను పాటించడంలో వైఫల్యంగా పేర్కొన్నారు.
డెబ్బై ఐదేండ్ల దేశ చరిత్రలో గతంలో ఎప్పుడూ జరగని ఘటన ఇప్పుడు జరిగిందని తెలిపారు. తొంభై రెండు మంది ఎంపీలను లోక్సభ, రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారని ఫైర్ అయ్యారు. ఇది కేవలం తమ హక్కుల మీద దాడి కాదని అన్నారు. తాము ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తామని పేర్కొన్నారు. అందువల్ల ఇది దేశ ప్రజాస్వామ్యంపై దాడి అని వెల్లడించారు.
ఈ దేశంలో రాజ్యాంగ సంప్రదాయంపై దాడి జరిగిందన్నారు. ఈ దేశ పార్లమెంటరీ తీరుపై దాడి జరిగిందని ఫైర్ అయ్యారు. అహం అనే బుల్డోజర్ కింద ప్రజాస్వామ్యం నలిగిపోతోందన్నారు. మెజారిటీ ముసుగులో రాజ్యాంగాన్ని ఒక వ్యక్తి, ఒక పార్టీ తుంగలో తొక్కుతోందన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య సంప్రదాయాన్ని, పార్లమెంటరీ పద్దతిని ముక్కలు చేసి ఎక్కడికో విసిరేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.