సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ (Digital Health Profile) సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ హెల్త్ ప్రొఫైల్ కార్డుతో ఆరోగ్యశ్రీ ని అనుసంధానం చేయాలని సూచించారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సరైన వైద్యం అందించేందుకు వీలుంటుందని వివరించారు.
సచివాలయంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలన్నారు. దాన్ని ఒక యూనిక్ నంబర్‌తో అనుసంధానం చేయాలని సూచించారు. దీనివల్ల అత్యవసర సమయాల్లో ప్రజలకు సరైన వైద్యం అందించే అవకాశం కలుగుతుందన్నారు.
చాలా వరకు ఆరోగ్య శ్రీ కోసమే తెల్ల రేషన్ కార్డులకు ఎక్కువ మంది దరఖాస్తులు చేసుకుంటున్నారని అన్నారు. అందువల్ల ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధన సడలించే విషయాన్ని పరిశీలించాలన్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలవుతున్న తీరును, నిధులకు సంబంధించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు ప్రతీ మూడు నెలలకు ఒకసారి విధిగా ఆరోగ్యశ్రీ బిల్లు విడుదల చేయాలని ఆదేశించారు.
ప్రతి నెల 15వ తేదీల్లోగా ప్రభుత్వ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు విధిగా విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న టీచింగ్ హాస్పిటల్స్, ప్రభుత్వ హాస్పిటల్స్, పెండింగ్లో ఉన్న ఆరోగ్యశ్రీ బిల్లులు వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మెడికల్ కళాశాల ఉన్న ప్రతీ చోట నర్సింగ్, పారామెడికల్ కాలేజీ ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ మేరకు ఒక కామన్ పాలసీ విధానాన్ని తీసుకురావాలని ఆదేశించారు. బీబీనగర్ ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎయిమ్స్ లో వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లా ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు. కొడంగల్‌లో మెడికల్, నర్సింగ్ కాలేజీలో ఏర్పాటును పరిశీలించాలని అధికారులకు సూచించారు.
ఎయిమ్స్ ను సందర్శించి పూర్తిస్థాయి రిపోర్టు తయారు చేయాలని ఆదేశించారు. వైద్య సేవల విషయంలో అవసరమైతే కేంద్ర మంత్రిని తానే స్వయంగా కలిసి మాట్లాడుతానన్నారు. ఉస్మానియ ఆస్పత్రి విస్తరణ ఎదురయ్యే పలు సమస్యలను సీఎం దృష్టికి అధికారులు తీసుకు వచ్చారు. ఉస్మానియా హెరిటేజ్ భవనం ఇష్యూ రేపు హైకోర్టు బెంచ్ పైకి రానున్న నేపథ్యంలో కోర్టు తీర్పు ఆధారంగా తదుఫరి నిర్ణయం తీసుకుందామని పేర్కొన్నారు.