మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఎంపీ (MP) దిగ్విజయ్ సింగ్ (Digvijay Singh) కు థానే మెజిస్ట్రేట్ కోర్టు షాక్ ఇచ్చింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) నేత మాధవ్ సదాశివ్ రావ్ గోల్వాల్కర్ ను కించపరుస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్టు చేసిన కేసులో ఆయనకు సమన్లు (Summons) జారీ చేసింది. ఈ కేసులో నవంబర్ 20న కోర్టు ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
ఆర్ఎస్ఎస్‌లో గోల్వాల్కర్ రెండవ సర్ సంఘ చాలక్. ఆర్ఎస్ఎస్‌లో అత్యంత ప్రభావవంతమైన, ప్రముఖ వ్యక్తుల్లో ఆయన ఒకరు. గోల్వాల్కర్ పై ఈ ఏడాది జూలై 8న దిగ్విజయ్ సింగ్ ఒక ట్వీట్ చేశారు. వెనుకబడిన, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల ప్రజల పట్ల గోల్వాల్కర్ ఆలోచనలు ఎలా వున్నాయో తెలుసా అంటూ ట్వీట్ లో రాసుకొచ్చారు. దానికి గోల్వాల్కర్ చెప్పిన కొటేషన్ అంటూ ఒక పోస్టర్ పెట్టారు.
ఆ కొటేషన్‌లో ‘దళితులు, వెనుకబడినవారు, ముస్లింలకు సమాన హక్కులు కల్పించడం కంటే బ్రిటిష్ పాలనలో జీవించడమే తాను ఇష్టపడతాను’అని గోల్వాల్కర్ చెప్పారంటూ ఆ ట్వీట్‌లో దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. ఈ ట్వీట్ వైరల్ అయింది. దీనిపై ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత సునీల్ అంబేకర్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. గోల్వాల్కర్ ఎప్పుడూ అలాంటి మాట అనలేదన్నారు. కేవలం సంఘ్ ప్రతిష్టను దిగజార్చేందుకే కాంగ్రెస్ ఇలాంటి ట్వీట్స్ చేస్తోందన్నారు.
గోల్వాల్కర్ తన జీవితమంతా సామాజిక వివక్షను అంతం చేయడానికే పోరాటం చేశారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఇండోర్ లోని తుకో గంజ్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. పలు సెక్షన్ల కింద దిగ్విజయ్ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యాఖ్యలపై థానేకు చెందిన ఆర్ఎస్ఎస్ నేత వివేక్ చంపేకర్, సింగ్ లు పరువు నష్టం దావా వేశారు.