– నిర్మల్ లో ఆగని ఆందోళనలు
– మాస్టర్ ప్లాన్ పై బీజేపీ యుద్ధం
– మహేశ్వర్ రెడ్డి దీక్షకు మద్దతుగా నిరసనలు
– డీకే అరుణ అరెస్ట్
– పోలీసుల తీరుపై కిషన్ రెడ్డి ఆగ్రహం
నిర్మల్ (Nirmal) మాస్టర్ ప్లాన్ పై బీజేపీ (BJP) పోరు కొనసాగుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తోంది. ఇటు మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి (Maheswar Reddy) దీక్ష కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆయన్ను పరామర్శించేందుకు వెళ్తున్న బీజేపీ నేతలను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత ఐదు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్నారు మహేశ్వర్ రెడ్డి. ఈ దీక్షకు మద్దతుగా ఆదివారం భారీగా బీజేపీ శ్రేణులు తరలివచ్చారు.
నిర్మల్ రహదారిని దిగ్బంధించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసే క్రమంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. దీంతో లాఠీఛార్జ్ చేసి నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
ఇటు మహేశ్వర్ రెడ్డిని పరామర్శించేందుకు వెళ్తున్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (DK Aruna) ను పొలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఆమెను ఆపారు పోలీసులు. ఆ సమయంలో వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఎంపీ అరవింద్ (MP Aravind).. పోలీసులు డీకే అరుణని అడ్డుకున్నారని గమనించి కారు దిగి వారితో మాట్లాడారు. ఈక్రమంలో పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారితీసింది.
కిషన్ రెడ్డి ఆగ్రహం
బీఆర్ఎస్ సర్కార్ ఇష్టారాజ్యంగా ప్రభుత్వ భూములను అమ్ముకుంటోందని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. నిర్మల్ జిల్లా ఇండస్ట్రియల్ జోన్ ను మాస్టర్ ప్లాన్ పేరుతో కమర్షియల్ 220 జీఓ తీసుకొచ్చారని మండిపడ్డారు. ఆందోళన చేస్తున్న రైతులు, బీజేపీ కార్యకర్తలపై విచక్షణా రహితంగా లాఠీఛార్జ్ చేసి గాయపర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న మహేశ్వర్ రెడ్డికి సంఘీభావం తెలిపేందుకు డీకే అరుణ వెళితే పోలీసులు అడ్డుకున్నారన్నారు. శాంతి భద్రతలు పాటించాల్సిన పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు కిషన్ రెడ్డి.