– బెంగళూరు ఎయిర్ పోర్టులో ఆసక్తికర సన్నివేశం
– చంద్రబాబును కలిసిన డీకే శివకుమార్
– త్వరలో సార్వత్రిక ఎన్నికలు
– బీజేపీతో వర్కవుట్ కాకపోతే కాంగ్రెస్ తో ముందుకెళ్తారా?
– డీకే, బాబు భేటీ వెనుక ఆంతర్యమేంటి..?
ఆంధ్రా (Andhra Pradesh) రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటిదాకా వైసీపీ (YCP) గెలుపు కోసం తెగ శ్రమించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashanth Kishor) ఇటీవలే టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) ను కలిశారు. రాష్ట్ర విభజన తర్వాత కనుమరుగు అయిన కాంగ్రెస్ (Congress) పార్టీ ఇప్పుడు యాక్టివ్ అయింది. ఏకంగా మాజీ సీఎం వైఎస్ కుమార్తె షర్మిల (Sharmila) ను రంగంలోకి దింపేందుకు చూస్తోంది. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొనగా.. చంద్రబాబును కాంగ్రెస్ కీలక నేత డీకే శివ కుమార్ (DK Sivakumar) కలవడం హాట్ టాపిక్ గా మారింది.
బెంగళూరు టీడీపీ ఫోరం మీటింగ్ కోసం కర్ణాటక వెళ్లారు చంద్రబాబు. బెంగుళూరు హెచ్ఏఎల్ ఎయిర్ పోర్టుకు ఆయన చేరుకోగానే టీడీపీ శ్రేణులు ఆహ్వానం పలుకుతారని అనుకుంటే.. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెల్ కమ్ చెప్పారు. అంతటితో ఆగకుండా చంద్రబాబును పక్కకు తీసుకెళ్లి కాసేపు ముచ్చటించారు. వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది.
కాంగ్రెస్ లో ప్రస్తుతం ట్రబుల్ షూటర్ గా ఉన్నారు డీకే శివకుమార్. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు వెనుక ఈయన శ్రమ ఎంతో ఉంది. పైగా, పార్టీలో ఎవరు జాయిన్ అవ్వాలన్నా ఆయన దగ్గరకే వెళ్లి అన్నీ చక్కబెట్టుకుని వస్తున్నారు. త్వరలో ఆంధ్రాలో ఎన్నికలు ఉన్నాయి. ఈ తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబును డీకే ఎయిర్ పోర్టులో రిసీవ్ చేసుకోవడం.. కాసేపు ప్రత్యేకంగా మాట్లాడడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఆంధ్రాలో ఇన్నాళ్లూ బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన.. ఇప్పుడు టీడీపీకి అత్యంత దగ్గరైంది. బీజేపీని కూడా పవన్ కళ్యాణ్ దగ్గర చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఇది వర్కవుట్ కాకపోతే.. కాంగ్రెస్ ను కలుపుకుని విపక్ష కూటమి తయారు చేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ ఆయన్ను బెంగళూరు ఎయిర్ పోర్టులో కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.