డీఎంకే (DMK) ఎంపీ దయానిధి మారన్ ( Dayanidhi Maran) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందీ భాషను తక్కువ చేస్తూ మాట్లాడుతూ వివాదాల్లో ఇర్కుకున్నారు. హిందీ మాట్లాడే బిహార్ కు చెందిన వ్యక్తులు తమిళనాడులో టాయిలెట్లు కడుగుతున్నారంటూ చులకన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దయానిధి వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
ఓ సమావేశంలో దయానిధి మారన్ మాట్లాడుతూ…. ఇంగ్లీష్ మీడియంలో చదవిన వారికి ఐటీ రంగంలో భారీగా వేతనాలు వస్తున్నాయని తెలిపారు. కానీ మాట్లాడితే హిందీ.. హిందీ అనే వాళ్లు మాత్రం భవన నిర్మాణ కూలీలుగా పని చేస్తున్నారని అన్నారు. బిహార్‌లో కేవలం హిందీలో చదువుకున్న వాళ్లు తమిళనాడులో రోడ్లు ఊడుస్తూ, టాయిలెట్లు కడుగుతున్నారంటూ ఎద్దేవా చేశారు.
దీనిపై బీజేపీ జాతీయ ప్రతినిధి షహబాద్ పూనావాల స్పందించారు. మొదట ఉత్తర భారత ఓటర్లను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అవమానించారని అన్నారు. ఇప్పుడు కొందరు బిహార్ డీఎన్ఏను అవమానపరుస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఈ వ్యాఖ్యలపై లాలూ, నితీశ్ కుమార్, తేజస్వీయాదవ్ స్పందించరా అని ప్రశ్నించారు.
ఇది ఇలా వుంటే డీఎంకే నేతల వ్యాఖ్యలు ఇండియా కూటమికి తలనొప్పిగా మారుతున్నాయి. ఇటీవల సనాతన ధర్మంపై ఉదయ నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు అగ్గి రాజే శాయి. తాజాగా దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యలపై బిహార్ సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ చీఫ్ లాలూ స్పందిస్తారా లేదా రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా ఇండియా కూటమితో ముందుకు వెళ్తారా చూడాలని బీజేపీ నేతలు అంటున్నారు. మరోవైపు ఇది పాత వీడియో అని డీఎంకే చెబుతోంది. దాన్ని ఉద్దేశ పూర్వకంగా ఇప్పుడు బీజేపీ వైరల్ చేస్తోందని డీఎంకే చెబుతోంది.