దేశంలో కుక్క కాట్లు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.. రోడ్లపై స్వైర విహారం చేస్తున్న గ్రామ సింహాలు.. కనిపించిన వారిని కాట్లు వేస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా దాడులు చేస్తున్నాయి. ఇలాంటి ఘటనల్లో బాధితులు మృత్యువాత పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా వీధి కుక్కల దాడిలో ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామంలో చోటు చేసుకొంది.
ముస్తాబాద్ రామవ్వ (75) అనే వృద్ధురాలి పై కుక్కలు దాడి చేశాయి. ఆమె ముఖం చేతులు తీవ్రంగా గాయపరిచాయి. ప్రమాదాన్ని గమనించిన గ్రామస్తులు వాటి వెంటపడి తరిమి వేశారు. తీవ్రంగా గాయపడి రక్తస్రావంలో ఉన్న రామవ్వను కామారెడ్డి (Kamareddy) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు నిజామాబాద్ (Nizamabad) జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. అంతలో పరిస్థితి విషమించడంతో రామవ్వ మృతి చెందింది.
మరోవైపు పంజాబ్ (Punjab), కపుర్తలా జిల్లాలోని పస్సాన్ కడిమ్ (Passan Kadim) గ్రామంలో వీధి కుక్కలు చేసిన దాడిలో ఓ మహిళ అత్యంత దారుణంగా చనిపోయింది. ఒకేసారి ఆమెపై 20 కుక్కలు దాడి చేయడంతో.. మహిళ ఏమీ చేయలేకపోయింది. మహిళపై పడి దారుణంగా పీక్కుతిన్న కుక్కలు చనిపోయే వరకు వదిలిపెట్టలేదు. చనిపోయిన తర్వాత కూడా అవయవాలను ముక్కలు ముక్కలుగా కొరికి తిన్నాయి.
ఇలాంటి ఘటనలు పస్సాన్ కడీమ్ గ్రామంలో గతంలో కూడా చోటు చేసుకున్నాయి. కొద్దిరోజుల క్రితమే అస్సు కుమార్ అనే ఓ పిల్లాడిని వీధి కుక్కలు కరిచి చంపాయి. అంతకుముందు కూడా పింకీ దేవి అనే మహిళపై దాడి చేయగా.. ఆమె ఇప్పటికీ సుల్తాన్‌పూర్ సివిల్ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య ఉంది. ఈ ఘటనలతో పస్సాన్ కడీమ్ గ్రామ ప్రజలు బయటికి రావాలంటేనే భయాందోళనలకు గురవుతున్నారు.