టీవీ ఛానెల్స్ (Tv Channels) కు సమాచార ప్రసార మంత్రిత్వ ( Infomation And Broadcasting Ministry) శాఖ కీలక సూచనలు చేసింది. ఉగ్రవాదంతో సహా తీవ్రమైన నేరాలకు పాల్పడే వ్యక్తులకు లేదా చట్టం ద్వారా నిషేధానికి గురైన వ్యక్తులను ఇంటర్వ్యూ చేయడం, వారితో చర్చలు చేపట్టడం వంటివి చేయరాదని ఆదేశాలు జారీ చేసింది.
ఇటీవల ఖలిస్తానీ ఉగ్రవాది, సిఖ్ ఫర్ జస్టిస్ ప్రతినిధి ఫక్త్వుంక్ పన్నూను ఓ న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. దేశ సార్వభౌమత్వానికి , సమగ్రతకు, భారతదేశ భద్రతకు హాని కలిగించే పన్నూ వ్యాఖ్యలు వున్నాయని కేంద్రం పేర్కొంది. ఇవి దేశంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
చట్ట ప్రకారం భారత్ లో నిషేధానికి గురైన ఓ సంస్థకు చెందిన వ్యక్తి, తీవ్రవాదంతో సహా పలు తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న విదేశీ వ్యక్తిని ఇటీవల ఓ టెలివిజన్ ఛానెల్ లో చర్చకు ఆహ్వానించిన విషయం తమ దృష్టికి వచ్చినట్టు కేంద్రం పేర్కొంది. విదేశాలతో భారత స్నేహపూర్వక సంబంధాలకు హాని కలిగించే సదరు వ్యక్తి వ్యాఖ్యలు చేశాడని చెప్పింది.
మీడియా స్వేచ్ఛను కేంద్రం సమర్థిస్తుందని తెలిపింది. రాజ్యాంగం ద్వారా మీడియాకు సంక్రమించిన హక్కులను కేంద్రం గౌరవిస్తుందని పేర్కొంది. అదే సమయంలో టీవీ ఛానెల్స్ ప్రసారాలు కేబుల్ టీవీ నెట్ వర్క్స్ (రెగ్యులేషన్) యాక్ట్ ,1995కు అనుగుణంగా వుండాలని సూచించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.