మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఎమ్మెల్యే (Bellampalli MLA) దుర్గం చిన్నయ్యకు ఓటు వేస్తే మహిళలకు రక్షణ ఉండదంటూ శేజల్ (Sejal) చేపట్టిన ప్రచారం ఉద్రిక్తతలకు దారి తీసింది. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య (Durgam Chinaiah) తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ కొన్ని నెలల శేజల్ అనే యువతి ఆరోపిస్తూ ఆత్మహత్య (Suicide) ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ఆమె ఇవాళ బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టారు.
త్వరలోనే తెలంగాణాలో ఎన్నికలు (Elections) రాబోతున్న తరుణంలో దుర్గం చిన్నయ్యకు ఓటు వేయద్దని బెల్లంపల్లిలో ప్రచారం చేపట్టారు. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మద్దతుతో బజార్ ఏరియాలో దుర్గం చిన్నయ్యకు ఓటు వేయద్దని ఆమె స్థానిక ప్రజలను కోరుతూ ప్రచారం చేశారు. మహిళలను లైంగికంగా వేధించే దుర్గం చిన్నయ్య లాంటి వ్యక్తులకు ఓటు వేస్తే మహిళలకు రక్షణ ఉండదని, దీనిని గుర్తుపెట్టుకుని నియోజకవర్గంలోని ప్రజలు ఓటు వేసే సమయంలో ఆలోచించాలని కోరారు.
ఆమె ప్రచారం చేస్తున్న సమయంలో అక్కడికి పోలీసులను వెంటబెట్టుకుని బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి ఆమె ప్రచారాన్ని అడ్డుకున్నారు. ఆమెకు మద్దతుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగారని శేజల్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు శేజల్ ని అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.
మరో వైపు శేజల్ మద్దతు ఇచ్చినందుకు బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోడి రమేష్ ఇంటికి వెళ్లి గొడవ చేయడంతో పాటు శేజల్ ను అడ్డుపెట్టుకుని తమ పార్టీపై, నాయకులపై బీజేపీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ మద్ధతుదారులు భగత్ సింగ్ చౌరస్తా అందోళనకు దిగారు.