ఉత్తరాఖండ్ లో వార్షిక చార్ ధామ్ యాత్ర ముగిసింది. ఈ నేపథ్యంలో బద్రీనాథ్ ఆలయ ద్వారాలను తాత్కాలికంగా మూసివేశారు. ఆలయాన్ని మూసివేసే ముందు ప్రధాన పూజారి రావల్ ఈశ్వర్ ప్రసాద్ నంబూద్రి స్త్రీ వేషధారణలో బద్రీ-విశాల్ ధామ్ గర్భగుడిలో లక్ష్మీ దేవి విగ్రహాన్ని ప్రతిష్టించారని ఆలయ వర్గాలు వెల్లడించాయి. అనంతరం ఉద్దవ్ జీ, కుబేర్ జీ దేవతా మూర్తులను పూజారి ఆలయ ప్రాంగణానికి తీసుకుని వచ్చారు.
శనివారం మధ్యాహ్నం 3.33 గంటలకు ఆలయ తలుపులను మూసివేశారు. శీతాకాలం నేపథ్యంలో ఆలయాన్ని తాత్కాలికంగా మూసి వేసిన్నట్టు చెప్పారు ఆలయ నిర్వాహకులు.
శీతాకాలంలో సుమారు 4 నెలల పాటు బద్రీనాథ్ ఆలయం పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. అందువల్ల ఆలయ సందర్శనకు భక్తులను అనుమతించరు. మళ్లీ మే నెలలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు.
రుద్రప్రయాగ్ లోని బద్రీనాథ్ ధామ్ ను శనివారం అత్యంత సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. 15 క్వింటాళ్ల బంతి పూలతో అలంకరించారు. శుక్రవారం సుమారు 10,000 మంది భక్తులు బద్రీనాథ్ ను దర్శించుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది 18.25 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్టు పేర్కొన్నారు.