డబుల్ బెడ్ రూం ఇళ్ళ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులకు అన్యాయం చేస్తుందని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్ళు అని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం, స్థానికేతరులైన అనర్హులకు కేటాయించి పేదలను మోసం చేస్తుందని ఆయన విమర్శించారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగుడ మున్సిపాలిటీలో స్థానికులకే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇవ్వాలని స్థానికులు అందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్ పాల్గొన్ని వారికి మద్ధతు తెలిపారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రోద్బలంతో స్థానికులకు అన్యాయం చేస్తూ, స్థానికేతరులకు ఇళ్ళు కేటాయిస్తున్నారని ఆరోపించారు.
తుక్కుగూడ పరిధిలో ఫేస్ – | కింద 10 ఎకరాల భూములో 832 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను, ఫేస్ -II కింద 12 ఎకరాల్లో 2016 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి స్థానికులకు అన్యాయం చేస్తూ, స్థానికేతరులకు కేటాయించారన్నారు.భూములు కోల్పోయింది స్థానికులైతే, మంత్రి సబితా రాజకీయ ప్రయోజనాల కోసం స్థానికేతరులకు ఇండ్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు.
హైదరాబాద్ చుట్టూ ఉన్న అనేక అసైన్డ్ భూములను, ముఖ్యంగా పేదలకు కేటాయించిన వాటిని తీసుకుని వాటిని పారిశ్రామిక పార్కులకు కేటాయిస్తుందని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు విషయంలో అవకతవకలు జరిగాయని, వాటిపై ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.