ఉత్తరాఖండ్ టన్నెల్ (Uttarakhand Tunnel) లో రెస్క్యూ ఆపరేషన్ (Rescue Operation) మరోసారి నిలిచి పోయింది. సిల్క్యారా సొరంగంలో శిథిలాల గుండా డ్రిల్లింగ్ చేస్తున్న ఆగర్ డ్రిల్లింగ్ మిషన్ కు కొన్ని ఇబ్బందులు ఎదరవుతున్నాయని అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్ తెలిపారు. నిన్న కూడా డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో ఆగర్ మిషన్ కు ఇనుప పట్టీ అడ్డుగా వచ్చింది.
ఈ క్రమంలో డ్రిల్లింగ్ కాసేపు ఆపివేశారు. మళ్లీ ఈ రోజు ఉదయం డ్రిల్లింగ్ మొదలు పెట్టారు. తాజాగా మళ్లీ ఆ మిషన్ కు ఇబ్బందులు కావడంతో డ్రిల్లింగ్ కు ఆటంకం ఏర్పడింది. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్ తుది దశకు చేరుకుందని అంతకు ముందు నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ వెల్లడించింది. ఆగర్ మిషన్ కు ఎలాంటి ఇబ్బందులు కలగకపోతే మరి కొద్ది గంటల్లోనే రెస్క్యూ ఆపరేషన్ పూర్తవుతుందని పేర్కొంది.
ఆగర్ మెషిన్ కు ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకపోతే, ప్రస్తుతం ఉన్నట్టుగా గంటకు 4 నుంచి 5 మీటర్ల డ్రిల్లింగ్ చేస్తే రేపు ఉదయం వరకు మీరు ఒక గుడ్ న్యూస్ వింటారని ఎన్డీఎంఏ అధికారి లెఫ్ట్ నెంట్ జనరల్ సయ్యద్ అటానైన్ తెలిపారు. ఈ ప్రాంతంలో హిమాలయన్ భౌగోలిక పరిస్థితులు తమకు శత్రువుగా మారాయన్నారు.
ఇది ఇలా వుంటే టన్నెల్‌లో ఎస్కేప్ రూట్ కోసం రెండు పైపులను అమర్చి వాటి ద్వారా కార్మికులను బయటకు తీసుకు రావాలని అధికారులు ప్లాన్ చేశారు. ఆ మేరకు ఇప్పటికే ఓ పైపును విజయవంతంగా అమర్చారు దానికి మరో పైప్‌ని అమర్చితే ఎస్కేప్ రూట్ రెడీ కానుంది. ఇది ఇలా వుంటే టన్నెల్ వద్దకు సీఎం పుష్కర్ సింగ్ ధామీ చేరుకున్నారు.
రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా సహాయక చర్యలు తుది దశకు చేరుకున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. అనంతరం టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులతో సీఎం పుష్కర్ సింగ్ ధామి వీడియో కాల్ లో మాట్లాడారు. వీలైనంత త్వరగా అందరినీ సురక్షితంగా బయటకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.