హైదరాబాద్‌లో మరోసారి మాదకద్రవ్యాలు కలకలం రేపాయి. మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న ఓ యువతిని నార్సింగి (Narsingi) వద్ద ఎస్ఓటీ పోలీసులు (SOT Police)పట్టుకున్నారు. యువతిని ఓ టాలీవుడ్ హీరో ప్రియురాలిగా తెలుస్తోంది. ఆమె దగ్గర నుంచి 4 గ్రాములు ఎండిఎంఏ మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నగరానికి చెందిన ఉనీత్‌రెడ్డి, లావణ్యను పోలీసులు అరెస్టు చేశారు. కోకాపేటలోని ఓ అపార్ట్మెంట్లో లావణ్య నివసిస్తోంది. ఆమె సంగీతం టీచర్‌గా పని చేస్తోంది. ఇటీవల మోకిలా మాదకద్రవ్యాల కేసులో ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమెపై పోలీసులు నిఘా పెట్టినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారం మేరకు నార్సింగిలో ఆమెను పొలీసులు అరెస్టు చేశారు. ఆమె బ్యాగును తనిఖీ చేయగా మాదక ద్రవ్యాలు దొరికినట్టు పోలీసులు చెబుతున్నారు. ఓ టాలీవుడ్ హీరోకు ఆమె ప్రియురాలు అని విచారణలో పోలీసులు గుర్తించారు.
సినీ ఇండస్ట్రీలో చాలా మందితో ఆమెకు పరిచయాలు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు. వారిద్దరిపై ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నార్సింగి పోలీసులు వెల్లడించారు.