ప్రధాని మోడీ (PM Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. రావణ దహనమనేది కేవలం రావణుడి దిష్టిబొమ్మ దహనం చేయడమే కాదన్నారు. కులతత్వం, ప్రాంతీయత పేరిట భారత్ (India)ను విభజించేందుకు ప్రయత్నిస్తున్న శక్తులకు కూడా సంబంధించిదన్నారు. దేశంలోని ప్రజలంతా పది ప్రతిజ్ఞలు చేయాలని ప్రధాని సూచించారు.
కనీసం ఒక్క పేద కుటుంబన్నైనా సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంలో సహాయ పడతామని ప్రతిజ్ఞ చేయాలన్నారు. ఢిల్లీ ద్వారకాలో డీడీఏ మైదానంలో నిర్వహించిన దసరా వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… దేశ ప్రజలందరికీ నవరాత్రి, విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటామన్నారు. చంద్రుడిపై కాలుమోపిన రెండు నెలల తర్వాత ఈ పండుగ జరుపుకోవడం అత్యంత సంతోషంగా ఉందన్నారు. విజయదశమి సందర్భంగా ఆయుధ పూజ చేయడం కొన్ని తరాలుగా ఆనవాయితీగా వస్తోందన్నారు. దేశంలో ఆయుధ పూజను కేవలం ప్రజలు తమ సంక్షేమం కోసం మాత్రమే కాకుండా ప్రపంచ సంక్షేమం కోసం చేస్తారన్నారు.
మరోవైపు ఢిల్లీలోని ఎర్రకోటలో ధార్మిక లీలా కమిటీ దసరా ఉత్సవాలను నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొన్నారు. విజయ దశమి సందర్భంగా రాష్ట్రపతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ…. నేడు అవినీతి మొదలు ఉగ్రవాదం వరకు పలు సమస్యలను మనం ఎదుర్కొంటున్నా మని చెప్పారు.
ఆ సవాళ్లను అధిగమించేందుకు శ్రీరాముడి సిద్ధాంతాలు మనకు ఉపయోగపడతాయన్నారు. రాముడు రావణున్ని ఓడించినట్లే మనమంతా ఆధునిక ‘రావణున్ని’ కూడా ఓడించాలన్నారు. ఈ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ కూడా హాజరయ్యారు. రావణ దహనం చేశారు.